గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ తమ మిత్రత్వం గురించి ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం చాలా విచిత్రంగా ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తప్పడం లేదు. ఇరువురూ కూడా ప్రభుత్వపరంగా సహకరించుకొంటామని చెప్పారు కానీ దానిలో నిజాయితీ కనపించలేదు. ముఖ్యంగా కేసీఆర్ మాటలలో అది అసలు కనిపించలేదు.
“చంద్రబాబుతో మీ దోస్తీ గురించి చెప్పమని” మీడియా అడిగినప్పుడు “అందులో ఏముంది…రాజ్యాంగపరంగా సహకరించుకొంటున్నాము అంతే,” అని కేసీఆర్ జవాబు చెప్పారు. దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. ఆ తరువాత “ఓటుకి నోటు కేసు” గురించి అడిగిన ప్రశ్నకు, “దాని గురించి ఎన్నికల తరువాత మాట్లాడుకొందాము,” అని ఆయన చెప్పిన జవాబు చాలా సమయోచితంగా ఉంది. చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో కేసీఆర్ పై సూటిగా ఎటువంటి విమర్శలు చేయనప్పటికీ, కేసీఆర్ మాత్రం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడమే కాకుండా ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడారు కూడా. దానిని బట్టే ఆయనకి చంద్రబాబుతో స్నేహం కొనసాగించాలనే ఆసక్తి, ఆయన పట్ల ఏమాత్రం గౌరవం లేవని స్పష్టం అవుతోంది.
చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో “ప్రభుత్వాలు వేరు రాజకీయాలు వేరని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలుగా మేము సహకరించుకొన్నప్పటికీ, రాజకీయంగా తెరాసను ఎదుర్కొంటాము. తెలుగు జాతి ఉన్న ప్రతీ చోట తెదేపా ఉంటుంది,” అని చెప్పడం గమనిస్తే ఆయనకీ కేసీఆర్ పట్ల ఆయనకీ ఇంచుమించు అటువంటి భావమే ఉన్నట్లు అర్ధమవుతుంది. కానీ అందరికీ తెలిసిన కారణాల చేత ఆయన కేసీఆర్ తో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా కనబడుతోంది.
అదే మిత్రపక్షమయిన బీజేపీ గురించి, ప్రధాని నరేంద్ర మోడి గురించి ఆయన చాలా సానుకూలంగా మాట్లాడటం గమనించవచ్చును. మజ్లీస్ గురించి కేసీఆర్ కూడా ఇప్పుడు ఆవిధంగానే మాట్లాడుతుండటం గమనించవచ్చును. తప్పనిసరి పరిస్థితులలో ఇరు ప్రభుత్వాలు సహకరించుకొంటున్నప్పటికీ తెదేపా, తెరాసలు ఎప్పటికీ కూడా రాజకీయ శత్రువులనే విషయాన్ని ఇరువురు ముఖ్యమంత్రులు దృవీకరిస్తున్నారు.