తెలంగాణా న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. టాకూర్ అంగీకరించినందున, తెలంగాణా న్యాయవాదులు తమ సమ్మెని విరమించి మళ్ళీ విధులలో చేరిన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లతో ఆయన డిల్లీలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ నరసింహన్ వారిరువుతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణా ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు తను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. కెసిఆర్ కూడా సిద్దంగానే ఉన్నారు కనుక త్వరలోనే వారు డిల్లీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. టాకూర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. హైకోర్టు విభజనపై వారు ముగ్గురూ ఏకాభిప్రాయానికి రాగలిగితే ఆరు నెలలలోనే విభజన జరిగిపోవచ్చునని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సాధ్యమైతే, ఇంత సులువుగా పరిష్కరించదగ్గ సమస్యని ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్రప్రభుత్వం కలిసి రెండేళ్ళు నాన్చినట్లే భావించక తప్పదు. వారి రాజకీయ విభేదాలు, ప్రయోజనాల కోసమే వారు ఈ సమస్యని ఇంతకాలం నాన్చినట్లు భావించక తప్పదు.
హైకోర్టు విభజన కంటే ముందు సమ్మె చేస్తున్న న్యాయాధికారుల డిమాండ్లని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. టాకూర్ పరిష్కరించవలసి ఉంటుంది. వారిపై హైకోర్టు విదించిన సస్పెన్షన్ ఎత్తివేయించడం ఆయనకి పెద్ద సమస్య కాదు కానీ న్యాయాధికారుల నియామకాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని వెనక్కి తీసుకోవడం, వారి స్థానంలో తెలంగాణాకి చెందినవారిని నియమించడానికి కొంత సమయం పట్టవచ్చు. కనుక దాని కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని పక్కనబెట్టి, ముందుగా హైకోర్టు విభజనకి కసరత్తు మొదలుపెట్టవలసి ఉంటుంది. సమ్మె చేస్తున్న తెలంగాణా న్యాయవాదులు అంతవరకు వేచి ఉండేందుకు అంగీకరిస్తారా? హైకోర్టు విభజనతో సహా అన్ని సమస్యలపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించేందుకు తను సిద్దంగా ఉన్నానని ఆపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే హైకోర్టు విభజన సమస్యతో మిగిలిన సమస్యలని కూడా ముడిపెట్టవచ్చని అర్ధమవుతోంది. అందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు త్వరలోనే దొరకవచ్చు.