ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మద్య మళ్ళీ యుద్ధాలు మొదలయినట్లు కనిపిస్తున్నాయి. ఆ మద్యన ఓటుకి నోటు కేసుతో పతాకస్థాయికి చేరుకొన్న వాటి యుద్ధాలు అదే కేసు తరువాత పూర్తిగా నిలిచిపోవడం అందరూ చూశారు. అప్పటి నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య కొంచెం ఘర్షణలు తగ్గి ప్రశాంత వాతావరణం కనిపించింది. కొంతకాలం అవి ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో కూడా వ్యవహరించాయి. కానీ ఆ నిశబ్ధం…ఆ ప్రశాంతత తాత్కాలికమేనని నిరూపిస్తూ రెండు ప్రభుత్వాలు మళ్ళీ ‘వార్-మోడ్’ లోకి వచ్చేశాయి.
కృష్ణా నదీ జలాల పంపకాల కోసం మొదలైన వాటి యుద్ధం ఇప్పుడు షెడ్యూల్ 10వ సంస్థలపై హక్కుల కోసం కొనసాగుతోంది. విభజన చట్ట ప్రకారం ఆ సంస్థలని పంచుకొందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థల హెచ్.ఓ.డి.లకు ఇటీవల లేఖలు వ్రాసింది. వాటి పంపకాల గురించి తనతో మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా ఆ సంస్థల హెచ్.ఓ.డి.లకు లేఖలు వ్రాయడాన్ని తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్రాసే లేఖలను పట్టించుకోవద్దని, దాని నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే ఆ విషయం తనకి తక్షణమే తెలియజేయాలని ఆదేశిస్తూ తెలంగాణా ప్రభుత్వం కూడా ఆ సంస్థల హెచ్.ఓ.డి.లకు లేఖలు వ్రాసింది.
షెడ్యూల్ 10వ సంస్థల ఆస్తులను, అప్పులను, ఉద్యోగులను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని విభజన చట్టంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కానీ అందుకు తెలంగాణా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తెలంగాణా గడ్డపై ఉన్న ఆ సంస్థలన్నీ తమకే చెందుతాయని వాదిస్తోంది. వాటిలో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులని తొలగిస్తూ గతంలో ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ ఆ సంస్థల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు నిశబ్ధం పాటించాయి. అంటే యధాతధ స్థితి కొనసాగుతోందనుకోవాలేమో? మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై హక్కుల కోసం పోరాటానికి తెర తీశాయి. ఇన్ని రోజులు అవి ఎందుకు మౌనం వహించాయో మళ్ళీ ఇప్పుడు యుద్ధం ఎందుకు ప్రారంభించాయో అనే అనుమానం కలుగకపోదు. బహుశః రాజకీయ కారణాలతోనే కావచ్చు.
యూపియే ప్రభుత్వం విభజన చట్టం తయారుచేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. ఆ తరువాత వచ్చిన మోడీ ప్రభుత్వమే ఈ సమస్యలన్నిటినీ ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యంగా పరిష్కరించవలసి ఉంది. కానీ అది కూడా చొరవ తీసుకోవడంలేదు. బహుశః దానికీ రాజకీయ కారణాలున్నాయేమో అనే అనుమానం కలుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భాజపా కలలు కంటోంది కనుక రెండు ప్రభుత్వాలు ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావిస్తోందేమో? అవి రెండు ఇదేవిధంగా ఎప్పుడూ కీచులాడుకొంటూ ఉండటమే భాజపాకి మేలు కలిగిస్తుందని భావిస్తోందేమో? రెండేళ్ళయినా ఇంకా ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయలేదంటే అదే అర్ధమనుకోవలసి ఉంటుంది.