త్వరలో ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల వ్యవహారంలో అలాగే ఇరు రాష్ట్రాలకు సంబందించిన అనేక ఇతర సమస్యలు, వివాదాలలో అయన తీరుని తెదేపా మంత్రులు, నేతలు తీవ్రంగా నిరసించారు. ఆయన తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే తెరాస ప్రభుత్వం కూడా వివిధ కారణాల చేత ఆయనతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజకీయ పార్టీలు భవన్ లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ విందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇరువురూ హాజరు కాకపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తను పదవిలో కొనసాగలేనని కేంద్రప్రభుత్వానికి అప్పుడే ఆయన చెప్పినట్లు సమాచారం. ఆయన స్థానంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయనకు రాష్ట్ర విభజన వలన ఎదురవుతున్న సమస్యలు, వివాదాలపై మంచి అవగాహన ఉంది. కనుక ఆయనైతే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయగలరని కేంద్రప్రభుత్వం భావిస్తునట్లు తెలుస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవచ్చును.