ఈ నెల 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఏపీ సిఎం జగన్ ప్రగతి భవన్ లో సమావేశమవుతున్నారు..ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు,విభజన సమస్యలపై చర్చించనున్నారు..ఆ తర్వాత రెండు రాష్ట్రాల సిఎస్ లు, ఇతర శాఖల ఉన్నతాాధికారులు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లోని 91 సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటి ఇప్పటికే సిఫారసులు ఇచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేని సంస్థల విభజన పూర్తి చేయాలని గతంలోనే గవర్నర్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి సంస్థల పంపకం ఖాయమేనా..?
ఆస్తులు,అప్పులు లేని సంస్థల విభజనకు మాత్రమే ఇప్పటి వరకూ జరిగింది. మిగిలిన వాటిపై ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పదో షెడ్యూల్ లోని 142 సంస్థల్లో యాభై వరకు సంస్థల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య పేచీ ఉంది. హెడ్ క్వార్టర్ ఆధారంగా, విభజన చేపట్టాలని ఏపీ చెబుతోంది..కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతానికే చెందుతాయని వాదిస్తోంది. ధీంతో ఈ అంశంలో రెండు రాష్ట్రాల మధ్య పీటముడి ఏర్పడింది.. దీంతో ముఖ్యమంత్రుల సమావేశంలో తొమ్మిది ,పదో షెడ్యూల్ సంస్థల విభజనపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది . ఈ భేటీలో ప్రధానంగా నీటి సమస్యలపైనే చర్చించనున్నారు తెలిసింది.
విద్యుత్ బకాయిలు మాఫీ చేసుకుంటారా..?
విద్యుత్, తొమ్మిది, పది షెడ్యూల్లలోని సంస్థల విభజన సహా ఉద్యోగుల విభజన విషయమై కూడా చర్చించనున్నారు. విద్యుత్ శాఖల పలు కీలక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం ప్రధానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెంది తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులకు న్యాయస్థాన ఆదేశాల ప్రకారం వేతనాలు ఇస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చించనున్నారు. అటు రెండు రాష్ట్రాలు కూడా విద్యుత్ వినియోగానికి సంబంధించి తమకు కోట్ల రూపాయల్లో డబ్బులు రావాలని అంటున్నాయి. ఈ విషయమై కూడా చర్చించనున్నారు..
గోదావరి జలాలు శ్రీశైలంకు తరలించే ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్..!
ముఖ్యంగా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే విషయం పైనే దృష్టి సారించనున్నారని అధికార వర్గాలంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలు, పరిష్కార మార్గాలపై తెలంగాణా ఇరిగేషన్ అధికారులు ఒక ప్రజంటేషన్ రూపొందించారని తెలిసింది..దీనిని ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రదర్శించి వివరించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మిగతా సమస్యల పరిష్కారంపై ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి సారించనున్నారని సమాచారం…