ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మించడానికి రాజధాని ప్రాంతంలో ఉద్దందరాయ పాలెం సమీపంలో గల వెలగపూడి గ్రామాన్ని ఎంచుకొంది. ఆ గ్రామంలో భూపరీక్షలు కూడా నిర్వహించి అక్కడ సచివాలయం నిర్మించడానికి అనువుగా ఉందని నిర్ధారించుకొన్న తరువాతనే దానిని ఖరారు చేసారు. ఆ గ్రామంలో సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో (సర్వే నెంబర్లు: 203,204,205,206,207,208,214)ఈ తాత్కాలిక సచివాలయం నిర్మించాలని నిర్ణయించుకొన్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మీడియాకు తెలిపారు. ప్రీ-ఫాబ్రికేటడ్ విధానంలో సుమారు ఆరున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే దీని కోసం టెండర్లు పిలుస్తామని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం రూ. 180 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ భవనం ప్రీ-ఫాబ్రికేటడ్ విధానంలో నిర్మించబడుతుంది కనుక ఐదారు నెలల్లోనే నిర్మాణం పూర్తి అవుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.