ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లన్నింటినీ ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వం స్వయంగా ఈ టికెటింగ్ గెట్‌వే ఏర్పాటు చేయడం లేదు. ప్రైవేటు టిక్కెటింగ్ వ్యవస్థకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం టెండర్లు పిలిచింది. బుక్ మై షోతో పాటు జస్ట్ టిక్కెట్ కూడా ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎల్ 1 గా జస్ట్ టిక్కెట్ నిలిచినట్లుగా తెలుస్తోంది.ఈ సంస్థలో అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ డైరక్టర్.
వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ గెట్‌వేగా కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏపీలో ఎక్కడ సినిమా చూడాలన్నా జస్ట్ టిక్కెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ధియేటర్లలో బుకింగ్‌లు కూడా ఆ పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
జస్ట్ టిక్కెట్ కాంట్రాక్ట్ దక్కడం అంటే మెగా కాంపౌండ్‌కు ఆ చాన్స్ వచ్చినట్లుగా నే భావించాలి. బుక్ మై షో కన్నా తక్కువ సర్వీస్ చార్జీలు తీసుకునేందుకు జస్ట్ టిక్కెట్ ముందుకు వచ్చింది. మొత్తం టిక్కెటింగ్ వ్యవస్ధను నడపాలి కాబట్టి జస్ట్ టిక్కెట్ కు గిట్టుబాటు అవుతుంది. ఈ సంస్థ అల్లు అరవింద్ కుటుంబానికి చెందినదని ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఉండదు. అయినా ఆ సంస్థను మధ్యలో వివిధ కారణాలు చూపి ఎలిమినేట్ చేయకుండా… ఎల్ వన్‌గా నిలిచే వరకూ ఉండనిచ్చారంటే.. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థం చేసుకోవచ్చు.