తెలంగాణా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెపుతున్నారు. ఆ దిశలోనే ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు కూడా. ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన భారీ కేటాయింపులే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవ్వాళ్ళ ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకి శంఖు స్థాపన చేసారు. పాలమూరు, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సుమారు 120 టి.ఎం.సి.ల నీళ్ళను ఉత్తర తెలంగాణా జిల్లాలకు అందించడానికి శరవేగంగా పనులు జరిపిస్తున్నారు.
తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుల వలన దిగువనున్న కృష్ణా, రాయలసీమ జిల్లాలకు నీటి కరువు ఏర్పడుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. అప్పుడు గానీ తెదేపా ప్రభుత్వం మేల్కొనలేదు. తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుల గురించి కేంద్రానికి పిర్యాదు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్ట ప్రకారం ఇరు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారానే నీళ్ళని పంచుకోవలసి ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఎగువనున్న కారణంగా ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించడానికి పూనుకోవడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వచ్చినప్పుడు, రెండు తెలుగు రాష్ట్రాలు గిల్లి కజ్జాలు పెట్టుకొని గొడవలు పడటం వలన రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోతారని కనుక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించేందుకు తను సిద్దమని అన్నారు. చంద్రబాబు నాయుడు అందుకు హర్షం వ్యక్తం చేసి స్వాగతించారు. అయితే అంతకు చాలా రోజుల ముందే తెలంగాణాలో ఈ ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ సంగతి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు కానీ అప్పుడు ఈవిధంగా బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించిన తరువాతనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో చలనం వచ్చినట్లుంది. అంటే జగన్ దేనిపైనైనా పోరాటం మొదలుపెట్టిన తరువాతనే చంద్రబాబు నాయుడు స్పందించడం అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. రెండు ప్రభుత్వాలు సహకరించుకొందామని చెప్పి నెలరోజులు కూడా కాక మునుపే, తెలంగాణా ప్రాజెక్టులపై ఆంధ్రా నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటకలకు వెళ్లి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒప్పందాలు చేసుకొని వస్తున్న కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో మాట వరుసకు కూడా మాట్లాడేందుకు ఇష్టపడక పోవడం గమనిస్తే, ఆయన ఇంకా అదే ఏహ్యతను కలిగి ఉన్నట్లు స్పష్టం అవుతోంది.