ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కజకిస్తాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని అస్తానా నగరాన్ని సందర్శించారు. రష్యా నుంచి ఆ దేశం విడిపోయిన తరువాత ఆదేశం కేవలం పదేళ్ళలో వ్యవధిలోనే చాలా అద్భుతంగా రాజధానిని నిర్మించుకొంది. ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని నిర్మించుకొంటున్నందున, ఒకసారి అస్తానా నగరాన్ని చూసి రమ్మని ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు అస్తానా సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని నిర్మాణశైలి చూసి చాలా ముగ్ధులయ్యి, కజకిస్తాన్ నిపుణుల చేతే అమరావతికి డిజైన్లు గీయించాలని నిశ్చయించుకొన్నారు. దీని కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకొందామని ప్రతిపాదించగా అందుకు ఆస్థాన మేయర్ అస్సెట్ లెస్కెషోవ్ అంగీకరించారు. దానిలో ఆంధ్రప్రదేశ్, అస్తానాకి చెందిన చెరో ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఆస్తానా బృందం ఆగస్ట్ నెలలో అమరావతిలో క్షేత్ర పర్యటనకి వచ్చినప్పుడు ప్రాధమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమరావతి నగరంలో నిర్మించబోయే భవనాలకి మొదట జపాన్ సంస్థ ఇచ్చిన డిజైన్లని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కానీ దానిపై విమర్శలు రావడంతో ఆ డిజైన్లలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఇప్పుడు ఆస్తానాకి ఆ పని అప్పగించేందుకు సిద్దపడుతోంది కనుక జపాన్ సంస్థని పక్కన పెట్టేసినట్లే భావించవలసి ఉంటుంది.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలనుకోవడం బాగానే ఉంది కానీ ఈ ఆలోచనలు, ప్రతిపాదనలు, అధ్యయనాలు, ఒప్పందాలతోనే రెండేళ్ళు గడిచిపోయాయి. ఇటువంటి అతిపెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టేముందు చాలా లోతుగా అధ్యయనం చేసి, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమే. అందుకు తగినంత సమయం తీసుకోవడం కూడా మంచిదే. అయితే ఈ యావత్ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చాలా సంక్లిష్టంగా తయారు చేసుకొంటున్నట్లు కనబడుతోంది.
సింగపూర్ చేత అమరావతి మాస్టర్ ప్లాన్ గీయించుకొని, దానిలో భవనాలకి జపాన్ చేత డిజైన్లు గీయించుకొని, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ సంస్థల చేత రాజధాని నిర్మించుకోవాలనుకొంది. కానీ ఇప్పుడు మధ్యలో ఆస్తానా వచ్చి చేరింది. దానికి కేవలం డిజైన్లు గీసే పని మాత్రమే అప్పగించబోతున్నారా లేదా దాని చేతే రాజధాని నిర్మాణం చేయించాలనుకొంటున్నారో తెలియదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని అనుకోగానే దేశీయంగా ఉన్న ఆర్కిటెక్ సంస్థలకి ఆ బాధ్యత అప్పజెప్పడం, అవి అత్యద్భుతమైన మూడు డిజైన్లను రూపొందించి ఇవ్వడం వంటి పనులన్నీ ఎటువంటి హడావుడి, ప్రచారం లేకుండానే జరిగిపోయాయి. అవి సింగపూర్ సంస్థ గీసిచ్చిన మాస్టర్ ప్లాన్, జపాన్ సంస్థ గీసిచ్చిన డిజైన్లకి ఏ మాత్రం తీసిపోనివిగా ఉన్నాయి. ఆ డిజైన్ ప్రకారమే ఏడాదిన్నరలోగా కొత్త సచివాలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కెసిఆర్ పట్టుదలగా ఉన్నారు.
అమరావతి విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రచారం, సందిగ్దతతో ముందుకు సాగుతోంది. ఈ హడావుడి, ప్రచారం, సందిగ్దత, అధ్యయనాలు, ఒప్పందాలు ఇంకా ఎన్నేళ్ళు సాగుతాయో ఎప్పుడు రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయో తెలియడం లేదు.