ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా చాలా సమస్యలు అలానే ఉన్నాయి. చట్టప్రకారం చెయ్యాల్సిన పంపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నిజానికి, కేంద్రం జోక్యం చేసుకుంటే ఇప్పటికే చాలా సమస్యలకు పరిష్కారం లభించేది. కానీ, తాత్సారం చేస్తూ వచ్చింది. ఆ దిశగా కేంద్ర హోం శాఖ ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తోంది. విభజన అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 8న ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాలనూ కోరింది. రెండు రాష్ట్రాల మధ్యా అపరిష్క్రుతంగా ఉన్న 8 కీలక అంశాలను చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. దీంతో, కనీసం కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభించే అవకాశం ఉందని భావించొచ్చు.
ఢిల్లీలో ఏపీ భవన్ విభజన ఇంకా జరగలేదు. అది నిజాం వారసత్వ సంపద భవనం కాబట్టి, మాకే చెందుతుందని తెలంగాణ ఎప్పట్నుంచో అంటోంది. ఏపీ భవన్ విభజన దిశగా గత చంద్రబాబు సర్కారు కొన్ని ప్రతిపాదనలను తెలంగాణకు పంపినా… అట్నుంచి సానుకూల స్పందన రాలేదు. దాంతో ఎక్కడి సమస్య అక్కడే ఉంది. త్వరలో జరగబోతున్న భేటీలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిస్కమ్ చెల్లింపుల అంశానికి కూడా ఇంతవరకూ పరిష్కారం లేకుండా ఉంది. తెలంగాణకు విద్యుత్ ఇచ్చినందుకు దాదా రూ. 5 వేల కోట్లు డిస్కమ్ లకు బకాయిలున్నాయని, దాన్ని చెల్లించేలా చెయ్యాలంటూ కేంద్రాన్ని కోరింది. అయితే, ఏపీ వాదన తప్పు అనేది తెలంగాణ వాదన. తాము చెల్లించాల్సింది రూ. 2 వేల కోట్లు మాత్రమే అని ఆ రాష్ట్రం అంటూ వస్తోంది. ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మేల్ విభజన కూడా తేల్లేదు. ఇది తెలంగాణలో ఉంది కాబట్టి, ఏపీ ఏ రకంగానూ వాటా ఇవ్వలేమన్నది ఆ రాష్ట్ర వాదన.
వీటితోపాటు విభజన చట్టంలోని షెడ్యూడ్ పదిలో ఉన్న సంస్థల విభజనపై కూడా ఇంకా లెక్కలు తేల్లేదు. వీటిపై కూడా ఢిల్లీలో జరగబోయే సమావేశంలో హోం శాఖ చొరవ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిపై ఏపీ ప్రభుత్వం ఈ మధ్య పట్టుబడుతోంది కాబట్టి, కేంద్రం చొరవ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. నిజానికి, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుందామనే అభిప్రాయంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. కాబట్టి, కీలకమైన ఏపీ భవన్, సింగరేణి వాటా, డిస్కమ్ చెల్లింపులు లాంటి కీలక అంశాలపై గతం కంటే ఇప్పుడు కాస్త పట్టు విడుపు ధోరణిలో తెలంగాణ వ్యవహరిస్తుందో లేదో చూడాలి.