తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు… రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఇంత వరకూ ఉమ్మడి సంస్థల విభజన కూడా జరగలేదు. చివరికి విభజన చట్టంలో బాగంగా తెలంగాణకు ఏపీ ఇచ్చిన కరెంట్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. ఎన్ని సార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. గత ప్రభుత్వంలో గవర్నర్ స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఆ గవర్నర్ కూడా తెలంగాణ వైపు వ్యక్తిలా వ్యవహరించడంతో ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో చర్చలు మానేసింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ పరిష్కారమవుతాయని అనుకున్నారు. కేంద్రం వద్దకు వెళ్లకుండా అన్నీ తేల్చుకుంటామని కేసీఆర్ – జగన్ ఉమ్మడిగా ప్రకటించారు. ఈ రెండున్నరేళ్లలో ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా జలజగడాలు మాత్రం మరింత పెరిగాయి. చివరికి ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పెట్టాల్సి వచ్చింది. అయితే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్రం చెబుతూ ఉండేది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు తేల్చుకోలేకపోతే కేంద్రమే నిర్ణయంతీసుకోవాలి.
అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని కేంద్రం జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తోంది. అయితే తన బాధ్యత మర్చిపోలేదని చెప్పడానికన్నట్లుగా అప్పుడప్పుడూ సీఎస్‌లను పిలిచి ఢిల్లీలో మీటింగ్ పెడుతూ ఉంటుంది. మరోసారి అలాంటి మీటింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు పిలుపు వచ్చింది. కానీ ఒక్క సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశ మాత్రం ప్రజలకు లేకుండా పోయింది. కొన్ని కీలక సమస్యలకు పరిష్కారం లభించినా ప్రజలు సంతోషపడతారు.