తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నికల హడావుడి మెరుపు తీగలా పూర్తి కానుంది. భారత ఎన్నికల సంఘం ఈ సారి కొత్తగా ఆలోచించింది. దక్షిణాదిలోని కీలక రాష్ట్రాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడత ఎన్నికలు పూర్తవుతాయి. ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇరవై ఐదో తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల విత్‌డ్రాకు… 27వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత రెండు వారాల.. ఎన్నికల ప్రచారం సమయం ఉంటుంది. ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ జరుగుతుంది. అంటే… గట్టిగా నెల రోజుల్లో పక్రియ మొత్తం పూర్తయిపోతుంది. అయితే ఫలితాల కోసం.. ఆ తర్వాత మరో నెలన్నర వరకూ వేచి చూడాలి. మే 23న అసలు కౌంటింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు.. ఈ షెడ్యూల్ ఓ రకంగా షాక్ లాంటిదే. ఎప్పుడూ మొదటి విడతలో జరిగింది లేదు. అలాగే.. రెండు రాష్ట్రాలకు కలిపి జరిపింది కూడా లేదు. ఇప్పుడు.. రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే సారని నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు చేశారు. ప్రచారాన్ని కూడా.. పదహారో తేదీ నుంచి ప్రారంభించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. చిక్కుముడి పడిన కొన్ని స్థానాల్లో మాత్రం కసరత్తు చేస్తున్నారు. వాటిపై .. ఒకటి రెండు రోజుల్లో… తేల్చనున్నారు. మరోవైపు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థులపై తనంతట తాను ఎలాంటి సమావేశాలు పెట్టలేదు. కానీ.. ప్రశాంత్ కిషోర్ బృందం మాత్రం.. సర్వేలు చేసి.. మొత్తానికి కొంత మంది అభ్యర్థుల జాబితా రూపొందించింది. అయితే ఇప్పటి వరకూ ఎవరికీ మీకే టిక్కెట్ అని చెప్పలేదు. దాంతో.. ఎవరూ పెద్దగా ప్రచార బరిలోకి దిగలేదు. క జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం.. ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. పొత్తుల కోసం.. కమ్యూనిస్టులు చాలా రోజులుగా జనసేన కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు.. అభ్యర్థులు, పొత్తులపై వారంలో.. నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ, వైసీపీల్లో టిక్కెట్లు దొరకని వారు వస్తే.. ఉన్న పళంగా నిలబెట్టడమే.. జనసేన అధినేత చేయగలగిందనే.. విశ్లేషణలు ఉన్నాయి.
ఇక తెలంగాణలో… అన్ని పార్టీలు.. ఎన్నికలకు తగ్గట్లుగా సిద్ధమయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశారు. ఆయన తనయుడు కేటీఆర్.. ప్రచార బరిలోకి దిగారు. వరుసగా ప్రచారసభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కూడా.. అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. బీజేపీ కూడా.. అభ్యర్థుల కసరత్తు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఈ సారి ఎలాంటి హోప్స్ లేకపోవడంతో.. ఎవరూ పట్టించుకోవడం లేదు.