రాజకీయాల్లో అందులోనూ 24/7 సమాచార యుగంలో ఎవరి స్థానం స్థిరంగా వుంటుందని చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలు పూర్తిగా తమతోనే వున్నారని వుంటారని లెక్కలు వేసుకుంటే అంతకన్నా పొరబాటు వుండదు. దినదినం క్షణక్షణం మారే పరిణామాలు ప్రజలను ప్రభావితం చేస్తుంటాయి. వారు కూడా చాలా వేగంగా స్పందిస్తుంటారు. విభజనకు ముందువరకూ తెలంగాణలో ఉద్రిక్తత వేడి చాలా ఎక్కువగా వుండేవి. అప్పుడు ఆంధ్ర రాయలసీమ నాయకులు తమ వాదనలు కోర్కెలు సరిగ్గా వినిపించలేదని కూడా విమర్శలు వస్తుంటాయి. అయితే విభజన సమయంలోనే ఇవన్నీ ఒక రూపం తీసుకుని ఎపికి ప్రత్యేక హౌదా వాగ్దానం లభించింది. రెండేళ్లుగా అది వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసాధించుకొస్తాడని ఆశిస్తున్న ప్రజలకు ఈ వారం రోజుల పరిణామాలు మల్లగుల్లాలు కళ్లు తెరిపించాయి. ఒక్కసారిగా రాజకీయాలు రాష్ట్ర పరిస్థితి వేడెక్కిపోయింది. మంగళవారం బంద్ పిలుపు అందుకో ఉదాహరణ మాత్రమే. చిరునామా గల్లంతైందనుకున్న కాంగ్రెస్ రంగంలో ప్రత్యక్షం కాగా పాలకపక్షం టిడిపి ఇరకాటంలో పడిపోయింది. ముందునుంచి పోరాడుతున్న వామపక్షాలు ప్రజా సంఘాలు విమర్శల పదును కదలిక పెంచగా వైసీపీ కూడా మరింత సూటిగా ముందుకు రావలసి వచ్చింది. ఇలా మొత్తానికి విభజన ముందరి కోర్కె సాధించుకోవడానికి ఎపి సమాయత్తం కావడం ఒక కీలక రాజకీయ మలుపు. ఇంకెప్పుడూ ఆ రాష్ట్ర రాజకీయాలు ఏకపక్షంగా వుండబోవు. ఎవరి బలం ఎంత అనేది ఒకటైతే ఘర్షణలు విమర్శలు పెరగడం తథ్యం. ప్రభుత్వం ఆత్మరక్షణ స్తితిలో పడటం నిజం. ప్రభుత్వం గజిబిజిలో పదిపోగా ప్రతిపక్షాలు క్రియాశీలం కావడం కనిపిస్తున్న దృశ్యం. నిజానికి ఈ వారంలో వివిధ ప్రాంతాల నుంచి నాకు వచ్చే ప్రేక్షకుల ఫోన్లు చాలా పెరిగాయి. పైగా వారు ఏవో చెప్పాలని ఆశపడుతున్నారు కూడా. స్తబ్తత వదలి సమరశీలత రావడం ఎపికి మంచి పరిణామమే. తెలంగాణలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిహత పాలనకు అనేక అపశ్రుతులు సంభవించాయి. మల్లన్నసాగర్తో మొదలై ఎంసెట్ పేపర్ లీక్ వరకూ అనేక ప్రతికూల పరిణామాలు సర్కారుకు సవాలుగా మారిన మాట నిజం. ప్రజాస్వామ్యానికి ప్రజల చైతన్యమే రక్ష అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.వీటినుంచి తగు పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు పొరబాట్లు సరిదిద్దుకంటే ఫర్వాలేదు.లేకుంటే అసంతృప్తి మరింత పెరుగడం అనివార్యమే.