రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హై ప్రోఫైల్ కేసులు చల్లబడిపోయినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం…. ఏపీలో వివేకా హత్య కేసుల్లో ఇక అరెస్టులే తరువాయి అన్న పరిస్థితి వచ్చింది. చివరికి రెండు కేసుల్లో అరెస్టులనేవి లేకపోగా… దర్యాప్తు మందగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అందర్నీ అరెస్ట్ చేసిన ఈడీ కవితను మాత్రం విచారించి వదిలేశారు. మళ్లీ పిలుస్తామని లీకులు ఇస్తున్నారు కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. మరో వైపు అవినాష్ రెడ్డికి ఎంతభరోసా వచ్చిందంటే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారు కూడా.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పట్టు బట్టి మరీ వివేకా కేసు దర్యాప్తు అధికారిని తప్పించారు. ఆ దర్యాప్తు అధికారి మీద నిందితులు పదే పదే ఫిర్యాలు చేస్తున్నారు. కేసులు పెట్టించారు. చివరికి నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లి తాము అనుకున్నది సాధించారు. ఆయనను తప్పించి కొత్త సిట్ ను నియమించారు. కానీ ఇప్పుడు ఆ కేసును సిట్ పట్టించుకుంటుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు కానీ… ఇంకా రంగంలోకి దిగలేదు సిట్. మొత్తంగా ఆ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లిపోయినట్లేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
దేశంలో రాజకీయ నేతల ప్రమేయం ఉన్న నేరాల్లో వ్యవస్థల పనితీరు ప్రజల్లో అనేక అనుమానాలకు దారి తీస్తున్నారు. డబ్బు, పలుకుబడి,, అధికారం ఉన్న వారికి ఓ రకంగా… ఇతర పేదల విషయంలో మరో రకంగా వ్యవస్థలు స్పందిస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. దానికి ఇలాంటి కేసులే కారణం. వ్యవస్థల్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావన ప్రజల్లో పెరిగిపోతోంది. అది సమాజానికి మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.