తెలంగాణ కరెంట్ బకాయిలు రూ. ఆరు వేల కోట్ల వరకూ చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి పిటిషనే వేసింది. ఏపీ ప్రభుత్వమే దాదాపుగా రూ. నాలుగున్నర వేల కోట్ల వరకూ తమకు చెల్లించాల్సి ఉందని తక్షణం వాటిని ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఏపీకి ఎవరు వచ్చినా… వారికి సంబంధం లేకపోయినా… ఏపీకి తెలంగాణ డబ్బులివ్వాలని ఇప్పించాలని విజ్ఞాపనపత్రం ఇస్తూంటారు. ప్రధానిని కలిస్తే.. అందులోనూ ఈ వినతి గ్యారంటీగా ఉంటుంది.కానీ ఇంత వరకూ ఎవరు ఏపీకి కరెంట్ బకాయిలు ఇప్పింటే ప్రయత్నం చేయలేదు.
కేసీఆర్‌తో దగ్గర సంబంధాలు ఉన్నా.. రాజకీయంగా ఇచ్చి పుచ్చుకుంటున్నా.. ఆయనను సీఎం జగన్ నేరుగా ఎప్పుడూ అడగలేదు. జగనే అడగనప్పుడు ఇతరులు ఎందుకు అడుగుతారు ?. గత ప్రభుత్వం తెలంగాణ నుంచి రావాల్సి బ కాయిలు ఇవ్వడం లేని.. తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీలో దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. వెంటనే జగన్ సర్కార్ ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ అసలు బకాయిలపై మాట్లాడటం మానేసింది.
రెండున్నరేళ్లు అయిన తర్వాత ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు రివర్స్‌లో తెలంగాణ సర్కార్ కూడా పిటిషన్ వేసింది. తమకు ఏపీ ఏ ఏ విభాగంలో ఎంతెంత ఇవ్వాలో లెక్కలు చెబుతూ.. పిటిషన్ వేసింది. వీటన్నిటికీ పత్రాలు కూడా సమర్పించిది. ఈ వివాదం కోర్టుకెళ్లిన వైనం.. రెండు రాష్ట్రాల బహిరంగవాదనలు చూసిన తర్వాత ఇప్పుడల్లా తేలే అంశం కాదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఏపీకి రావాల్సిన కరెంట్ బకాయిలు కోర్టులో ఇరుక్కుపోయినట్లే భావిస్తున్నారు.