పోలవరం నిధులు రావట్లేదు..! ..కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సర్కార్ ఒక్క మాట అడిగిన పాపాన పోలేదు.. !
జీఎస్టీ పరిహారం ఇవ్వట్లేదు..! .. ఇతర రాష్ట్రాలన్నీ చట్ట బద్ధంగా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నాయి. కేంద్రంపై మండిపడుతున్నాయి. కానీ.. ఏపీ సర్కార్.. కనీసం.. ఓ మాట అడిగిన సందర్భం లేదు.
రాజధానికి నిధుల్లేవ్..! రాజధాని ఖాతాలో ఇంకా వెయ్యి కోట్లిస్తామని కేంద్రం మూడేళ్ల కిందటే.. పార్లమెంట్లో చెప్పింది. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. ఇవ్వాలని కూడా ప్రభుత్వం అడగలేకపోయింది..!
ఈ మూడే కాదు… కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రయోజనాలు లెక్క లేనన్ని ఉన్నాయి. గత పదిహేను నెలల కాలంలో.. దేశంలో అనేక ప్రాజెక్టులు చేపట్టి ఉంటారు కానీ.. ఏపీకి ఒక్కటంటే.. ఒక్కటీ కేటాయించలేదు…అదేమిటని ప్రభుత్వమూ అడగలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడలేకపోతున్న ప్రభుత్వం..!
లోటు బడ్జెట్ నుంచి… కేంద్ర పన్నుల వాటా వరకూ ప్రతీ దాంట్లోనూ కోత పడుతోంది. అసలు కష్టాల్లో ఉన్న ఏపీకి అలా చేయవద్దని… అడగాల్సిన ప్రభుత్వం… నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. కేంద్రం నుంచి ఎంత ఎక్కువగా నిధులు, ప్రాజెక్టులు సంపాదించుకుంటేనే.. అంత ఎక్కువగా ఏపీ ప్రయోజనాలు నిలబడతాయి. కానీ ప్రస్తుతం.. ఆ దిశగా కనీస మాత్రం ప్రయత్నాలు జరగడం లేదు. ఆర్థిక సంఘం నిధులు.., పన్నుల్లో వాటాలు.. కోతలు వేసి ఇస్తే.. మహా ప్రసాదం ఇని ప్రభుత్వం తీసుకుంటోంది కానీ… న్యాయంగా రావాల్సిన వాటా కోసం ప్రయత్నించడం లేదు. నిలదీయడం సంగతి తర్వాత కనీసం ప్రశ్నించడం లేదు.
విభజన హామీల అమలు గురించి పూర్తిగా మార్చిపోయారేంటి..?
2014 -19 మధ్య విభజన హామీల అమలు కోసం.. కేంద్రం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఎంత ఒత్తిడి అంటే… కేంద్ర విద్యాసంస్థలు మొత్తం.. ప్రారంభించేసింది. అద్దె భవనాల్లో అయినా ప్రారంభించేసి.. శాశ్వత నిర్మాణాలకు కొద్ది కొద్దిగా అయినా నిధులు కేటాయిస్తూ వస్తోంది. కానీ గత పధ్నాలుగు నెలల కాలంలో… విభజన హామీలపై.. ప్రభుత్వం ఒక్క సారి కూడా ఫాలో అప్ చేసుకున్న సందర్భం లేదు. పెద్దల్ని కలిసినప్పుడు వినతి పత్రం ఇచ్చామని మీడియాకు సమాచారం ఇస్తారు తప్ప.. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని.. పట్టుబట్టిన సందర్భాలు లేవు. విభజన చట్టం ఇప్పుడు… కేంద్రం కూడా పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకుంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది.
ప్రత్యేకహోదానే కాదు.. ఏదీ అడగడం లేదు.. !
అప్పట్లో.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి డెడికేషన్ చాలా ఎక్కువగా ఉండేది. ప్రత్యేహోదా కోసం ప్రతీ ఊరిలనూ దీక్ష చేశారు. అలాగే.. ప్రతీ కాలేజీలోనూ సభలు.. సమావేశాలు పెట్టారు. అందరూ రాజీనామాలు చేస్తే.. ఎందుకు హోదా రాదని సవాల్ చేశారు. తన ఎంపీలతో రాజీనామాలు చేశారు. ఆ డెడికేషన్ చూసి ప్రజలు కూడా ముచ్చటపడ్డారు. కానీ తీరా అసలు సినిమా ప్రారంభమయ్యే సరికి… ఆ ప్రత్యేకహోదా కాదు.. కదా.. ఢిల్లీకి సలాం గిరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఏపీ ప్రయోజనాలన్నీ.. ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. పట్టించుకునేవారు లేరు.. ప్రశ్నించేవారు లేరు..!
కారణం కేసుల భయమా..? ఏపీకి ఏం అక్కర్లేదా..?
ఇరవై ఐదుకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే… ఢిల్లీలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా… గల్లా పట్టుకుని ప్రత్యేకహోదా తీసుకు వస్తానన్న డైలాగ్ చెవుల్లో మార్మోగుతున్న సమయంలోనే.. అసలు ప్రత్యేకహోదా కాదు.. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేనంత దుస్థితికి ఏపీ పడిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి..? కేంద్రంతో సత్సంబంధాల కోసం.. ఏపీ సర్కార్ పెద్దలు మెతకగా ఉండటమా..? ఏమైనా తిరగబడితే.. కేసులు తిరగదోడి భవిష్యత్ లేకుండా చేస్తారనే భయమా..? ఏదైనా కావొచ్చు.. కానీ అంతమంగా నష్టపోతోంది మాత్రం ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు.