ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్శిటీలకు నియమంచిన వైస్ చాన్సలర్ల జాబితాను చూసిన తర్వాత కొంత మంది విద్యావేత్తలు మళ్లీ ఏపీ ఉన్నత విద్యా రంగానికి పూర్వ వైభవం వస్తుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని ప్యూర్ ఎకడమిక్ నేపధ్యం ఉన్న వారికి మాత్రమే వెదికి వెదికి మరీ అవకాశం కల్పించారు. కొంత కాలంగా రాజకీయ వాసనలతో భ్రష్టుపట్టిపోయిన యూనివర్శిటీలు ఇప్పుడు కాస్త మెరుగుపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన వైస్ చాన్సలర్ల నియామకాలు వారు చేసిన అతి గురించి చెప్పాలంటే.. ఓ పుస్తకం అవుతుంది. అత్యంత కీలకమైన హెల్త్ యూనివర్శిటీ వీసీ .. జగన్ మోహన్ రెడ్డి భజనలో మునిగిపోయేవారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ..ఆ యూనివర్శిటీ క్యాంపస్ ను వైసీపీ ఆఫీసుగా మార్చేశారు. విద్యార్థులతో సర్వేలు చేయించేవారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ఏకంగా వైఎస్ విగ్రహాన్ని పెట్టించి భజనలు చేసేవారు. వీరే అతి అనుకుంటే.. ఇతర యూనివర్సిటీల వైఎస్ చాన్సలర్ల అతిని ఎవరూ భరించలేకపోయేవారు.
ఐదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎందుకైనా మంచిదని ఆ వీసీలంతా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం యూనివర్శిటీలను మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖ అకడమిక్ దిగ్గజాలను వెదికి పట్టుకుంది. ఇప్పుడు వారి ఎదుట ఎంతో పని ఉంది. యూనివర్శిటీలను మళ్లీ పూర్వ స్థాయికి తీసుకెళ్లాల్సిన ఉంటుంది. రాజకీయ జోక్యం లేని వర్శిటీ ప్రాంగణాల నుంచి అద్భుతమైన దేశ భవిష్యత్ ఆవిష్కృతమవుతుందనడంలో సందేహం ఉండదు.