ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో పోలిస్తే 2024లో రెండు శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు దూరాభారమైనా, ఖర్చులకు వెనుకాడకుండా వచ్చి ఓటేసి వెళ్లారు. ఇదగి వారిలో ఉన్న చైతన్యాన్ని తెలుపుతోంది. ప్రజాస్వామ్యంలో ఎంత ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటే అంత నిజమైన ప్రజాభిప్రాయం వెలుగులోకి వస్తుంది.
దేశంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజీ ఉన్న రాష్ట్రం ఏపీ. ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉండటం పట్టణ ప్రజలు కూడా ఓటు విషయంలో ఎంతో పర్టిక్యులర్ గా ఉండటంతో ఓటింగ్ శాతం ఎక్కువగా మారింది. ప్రతి వంద మందిలో 82 శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం మామూలు విషయం కాదు. పోస్టల్ ఓట్లలో కూడా 95 శాతానికిపైగా వినియోగించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. మామూలుగా అయితే వారు దరఖాస్తు కూడా సగం మందే చేసుకుంటారు.
పెరిగిన పోలింగ్ పర్సంటేజీ ఎటు వైపు ఉంటుందన్న దానిపై ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటారు. కానీ ఈ రెండు శాతం ఓట్లు మాత్రం ఫలితాల్ని డిసైడ్ చేయబోతున్నాయి. మా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందన్న అభిప్రాయానికి తావు లేకుండా.. . ఓటు అనేది అత్యంత ముఖ్యం అని భావిస్తున్న ఓటర్ల చైతన్యం.. ప్రజాస్వామ్యానికి రక్ష అనుకోవచ్చు.