”ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు అంతగా ఆర్ధిక ఇబ్బందులు లేవు…ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది” – నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా ఈ వ్యాఖ్యానం చేశారు.
నీతి ఆయోగ్ సూచనల మేరకు ఎపికి ఆర్ధిక సహాయాలూ కేటాయింపులూ వుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తనని కలిసినపుడు చెప్పారు. మరేరాష్ట్రానికీ వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వైస్ చైర్మన్ రావడాన్నిబట్టి కష్టాల్లో వున్న రాష్ట్రానికి గొప్పసహాయం దక్కవచ్చని మంత్రులు కూడా ఆశపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యానాన్ని బట్టి ప్రత్యేక తరగతి హోదాకు ఏమాత్రం అవకాశం లేదని స్పష్టమైపోయింది.
బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని – అబివృద్ధి నిధులను కేటాయించే సంస్ధ అధినేతే బహిరంగంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి స్పెషల్ పాకేజీల మీద ఆశలు పెట్టుకోకూడదని కూడా తేలిపోయింది.
జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు వివరాలను కూడా వైస్ చైర్మన్ తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎపితోపాటు చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఎలాంటి ముంపు నివారణ చర్యలు చేపడుతున్నారని పనగారియా అధికారులను ప్రశ్నించారు. సుమారు 371 ఆవాసాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయని, వాటిని ఖాళీ చేయమని కోరామని చీఫ్ ఇంజనీర్ వివరించారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ముంపు ప్రాంతాలకు పునరావాస చర్యలు చర్యలు చేపడుతున్నా మన్నారు.
ఈ సందర్భంగా బుధవారం పనగారియా విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితో ఎపికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. రాష్ట్రంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపి బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. సిఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణ మన్నారు. అయితే విభజన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత సిఎం చంద్రబాబుకు దక్కుతుందని ప్రశంసించారు. నీతి ఆయోగ్ నుంచి రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామన్నారు.