సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్ళు మరో ఇన్నేళ్ళలో రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తాము. మరో ఇన్నేళ్ళ తరువాత దేశంలో మనమే నెంబర్:1, మరో ఇన్నేళ్ళ తరువాత ప్రపంచంలోనే మనం నెంబర్:1 స్థానంలో ఉంటామని గొప్పలు చెప్పుకోవడం అందరూ నిత్యం వింటూనే ఉంటారు. అంతవరకు సదరు నేత జీవించి ఉంటాడో లేదో, ఉన్నా ఆ నేతకి చెందిన పార్టీ అంత కాలం అధికారంలో ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. అయినా ఆ మాటలు చాలా సానుకూల, ఆశాకరమైన దృక్పధంతో చెపుతున్నవే కనుక ఎవరూ వాటిని తప్పు పట్టరు. అలాగ జరిగితే మంచిదేకదా! అని అందరూ అనుకొని తృప్తి పడుతుంటారు.
అయితే ప్రభుత్వంలో, వ్యవస్థలలో అవినీతిని తొలగించడానికి కూడా నిర్దిష్టంగా ఇన్నేళ్ళు సమయం పడుతుందని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దానికీ నిర్దిష్టంగా గడవు ప్రకటించడం విశేషం. హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పరిపాలనా సంస్కరణల వలన 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా మారుతుందని అన్నారు. అంటే రాష్ట్ర ప్రజలు మరో 34 ఏళ్ళు ఓపిక పట్టాలన్న మాట! అంతవరకు ఈ అవినీతిని భరిస్తూనే ఉండాలన్నమాట!
తెదేపా మంత్రులు అందరూ తమ ప్రభుత్వం చాలా పారదర్శకంగా, అవినీతిరహితంగా పనిచేస్తోందని గొప్పలు చెప్పుకొంటుంటే, రాష్ట్ర రెవెన్యూ మరియు ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఈ కృష్ణమూర్తి మరో 34 ఏళ్ళ వరకు అవినీతి భరించాల్సిందేనన్నట్లు మాట్లాడటం తెదేపాకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగించే విషయమే.
పాలనలో సంస్కరణలు అమలుచేయడం ద్వారా అవినీతిని రూపుమాపి, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రెవెన్యూ, పురపాలఖ శాఖ, పెమాండు అనే సంస్థతో కలిసి పని చేస్తున్నాయి. పెమాండు సంస్థ ఆ రెండు మంత్రిత్వ శాఖల పనితీరుని లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవినీతి జరుగుతున్న లేదా అందుకు అవకాశం ఉన్నవాటిని గుర్తించి, అవినీతిని అరికట్టేందుకు తగిన సూచనలు, సలహాలు, ప్రణాళికలను ప్రభుత్వానికి అందజేస్తుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం అవినీతిని అరికట్టేవిధంగా ఎప్పటికప్పుడు సంస్కరణలు అమలుచేస్తుంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయడం చాలా మెచ్చుకోవలసిన విషయమే. కానీ అవినీతిని రూపుమాపడానికి మరో 34 ఏళ్ళు పడుతుందంటే ఎవరూ హర్షించరు. అలాగ చెప్పుకొని ఈవిధంగా విమర్శల పాలవడం కంటే, శాఖల వారిగా ప్రత్యేక నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు.