కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై తెలుగు న్యూస్ ఛానళ్లు స్పందిస్తున్న తీరు పట్ల రాష్ట్ర యువత తీవ్ర అసంతృప్తిలో ఉంది. వాటికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మినీ యుద్ధాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రకటించిన తొలిరోజు ఛానళ్లలో ఏపీకి జరిగిన అన్యాయంపై పెద్దగా చర్చలు జరగలేదు. తూతూ మంత్రంగా, నామమాత్రంగా వార్తలు చదివి ఊరుకున్నారని యువతరంలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గళం విప్పిన క్షణం నుంచి మీడియాలో, న్యూస్ ఛానళ్లలో కొంచెం కదలిక వచ్చింది. కానీ, ఏపీ యువతకు, ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాధాన్యత చాలదు. అంతకు మించి కావాలి.
పవన్‌కల్యాణ్ మీద కత్తి మహేష్ చేసిన కామెంట్స్‌పై పవన్ అభిమానులు ఎలా స్పందించారు? కత్తి మహేష్ ఎంత మనోవేదన అనుభవించారు? అనే అంశంపై కొన్ని నెలలు చర్చలు నిర్వహించారు. చర్చా వేదికలు పెట్టి సమస్యను మేమంటే మేము పరిష్కరించమని గొప్పలు చెప్పుకున్నారు. రాంగోపాల్ వర్మ బూతు సినిమా తీస్తే వారాల తరబడి చర్చలు నిర్వహించారు. వర్మను, మహిళా సంఘాలను లైవ్‌లకు పిలిచారు. వాదోపవాదాలను జనాలకు చూపించారు. తమిళ హీరోలు, రాజకీయాలపై గంటలు గంటలు వార్తలు ప్రసారం చేశారు. నటి, ఎమ్మెల్యే రోజా, నిర్మాత బండ్ల గణేష్ మధ్య నడిచిన బూతుల పర్వాన్ని లైవ్‌లో ప్రసారం చేసి, తర్వాత ఆ వీడియోని ఇప్పటికీ యూట్యూబ్‌లో యధాతథంగా ఉంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఇవన్నీ వ్యక్తుల, వ్యక్తిగత సమస్యలు. ఆయా అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన న్యూస్ ఛానళ్లకు, ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అంతగా పట్టడం లేదా? అని యువత ఆగ్రహం చెందుతోంది. ఆంధ్ర ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది.