ఉండటానికి ఇల్లు కొనాలనుకున్నప్పుడు అపార్టుమెంట్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. తక్కువలో వస్తుందని .. బడ్జెట్ సరిపోతుందని .. లోన్‌కు ఇబ్బంది ఉండదని ఆ నిర్ణయం తీసుకుంటారు. అయితే పెట్టుబడి కోసం అపార్టుమెంట్ కొనాలనుకున్నప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. పెట్టుబడికి తగ్గ పెరుగుదల ఉండాలి మరి.
సహజంగా భూమిని కొనుగోలు చేయడం వల్ల, అపార్ట్మెంట్ ఫ్లాట్ కంటే ఎక్కువ రాబడి ఇస్తుంది. భూముల రేట్లు , పెట్టుబడి విలువ ఏటికేడు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ ఔచర్ అవతల పదేళ్ల క్రితం గజం ఆరేడు వేలకు కూడ వచ్చేది. ఇప్పుడు కనీస నలభై నుంచి అరవై వేల వరకూ ఉంటోంది. అంటే ఎంత స్థాయిలో సంపద పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అపార్ట్మెంట్ ఫ్లాట్ వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అపార్ట్మెంట్ల నుంచి స్థిరమైన అద్దె ఆదాయం వస్తుంది. అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనడానికి సులభంగా రుణాలు లభిస్తాయి. కానీ పదేళ్ల కిందట అపార్టుమెంట్ వాల్యూ పాతిక లక్షలు ఉంటే.. ఇప్పుడు దాని విలువ ముఫ్పై లక్షలు ఉన్నా గగనమే. ఎందుకంటే అపార్టుమెంట్ పాతదయ్యే కొద్దీ విలువ తగ్గిపోతుంది. కానీ ల్యాండ్ విలువ పెరుగుతుంది. ల్యాండ్ షేర్ నుబట్టి దర వస్తుంది. సాధారణంగా ఓ అపార్టుమెంట్ కొంటే 30 నుంచి 40 గజాల లోపే ల్యాండ్ షేర్ వస్తుంది.
చక్కటి మౌలిక సదుపాయాలతో నగర కేంద్రాలకు సమీపంలో ఉంటే భూమి, అపార్ట్మెంట్ ఫ్లాట్ రెండింటి విలువలోనూ వృద్ధి కనిపిస్తుంది. తక్షణ అద్దె ఆదాయం కోసం చూస్తున్న వ్యక్తులకు అపార్ట్మెంట్ ఫ్లాట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎక్కువ పెరుగుదల కోసం దీర్ఘకాలం ఎదురు చూడగల పెట్టుబడిదారులు భూమిని కొనడం మంచిదని అనుకోవచ్చు.