తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది 48 శాతం వరకూ ఉంది. ఇక పోలింగ్ ముగియడానికి నాలుగు గంటల సమయమే ఉంది. చివరి క్షణంలో వచ్చి పోలింగ్ బూత్‌ల ముందు నిలబడినా డెబ్భై శాతం ఓటింగ్ జరుగుతుందా అనే సందేహం ఎక్కవ మందిలో వస్తోంది. సాధారణంగా ఓటు వేయాలన్న ఆసక్తితో ఉండే జనాలు మధ్యాహ్నం కల్లా పోలింగ్ బూత్‌లకు వచ్చి పని పూర్తి చేస్తారు. క్యూలైన్లు ఉన్నాయని తెలిస్తే మెల్లగా వస్తారు.
కానీ కనీసం పావుగంట సేపు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేని క్యూ లైన్లు న్నా ఓటర్లు రావడం లేదు. పట్టణాల్లో చాలా తక్కువగా ఓటింగ్ నమోదవుతోంది. పల్లెల్లోనూ తక్కువగానే ఉంది. గతంలో ఉన్నంత ఉత్సాహం లేదు. ఈ సారి ఎన్నికల హడావుడి అంతా పార్టీల్లోనే ఉంది కానీ. సామాన్యుల్లో లేకపోవడం వల్లనే పోలింగ్‌పై ఆసక్తి తగ్గిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓ టెంపోను క్రియేట్ చేశాయి. చంద్రబాబు ప్రచారం, కేసీఆర్ కౌంటర్.. మహా కూటమి వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగిన రాజకీయంను సామాన్యులను సైతం పోలింగ్ కేంద్రాలవైపు నడిపించింది. కానీ ఈ సారి రాజకీయం అంతా కాంగ్రెస్ కు ఓటు వేయవద్దన్న కేంద్రంగానే సాగింది . కాంగ్రెస్ తమకే ఓటు ఓటు వేయాలని కోరింది.
మొత్తంగా ఎన్నికల్లో ఓటర్ల నిరాసక్తత ఏ పార్టీకి సమస్యగా మారుతుందన్నది ఇబ్బందికరంగా మారింది. అధికార పార్టీకి ఓటు వేయడం ఎందుకు అనుకునేవారే ఓటింగ్ వైపు చూడటం లేదన్న వాదన వినిపిస్తోంది. పల్లెల్లో రాజకీయ నేతలు గ్రామాల వారీగా ఇన్ ఫ్లూయన్స్ చేసి.. ఓటింగ్ వరకూ తీసుకు రాగలుగుతున్నారు. పట్టణాల్లో మాత్రం అది రావడం లేదు.