రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రభుత్వానికి 6 ఒప్పందాలు కుదిరాయి. పూర్తి వివరాలు కాకపోయినా వాటి సారాంశాన్నయినా ప్రభుత్వం ప్రకటించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ వుండే కొందరు మంత్రుల ధోరణి చూస్తే ఈ వ్యవహారాలను పారదర్శకంగా వుంచే పరిస్ధితిలేదు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ, లేదా భూసమీకరణ పనులను పర్యవేక్షించవలసి వున్న రెవిన్యూ శాఖను, నిర్మాణాడాల అమలు, పర్యవేక్షణలు చూడవలసిన పట్టణాభివృద్ధి శాఖలను”అమరావతి” వ్యవహారాలనుంచి పూర్తిగా పక్కన పెట్టడమే ఇందుకు ఉదాహరణ.
సింగపూర్ పర్యటనలో పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్‌కు స్థానం కల్పించలేదు. రాజధాని ప్రణాళికపై సింగపూర్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నా, ఆ శాఖ ముఖ్య అధికారే పర్యటన బృందంలో లేకపోవడం చిన్నవిషయం కాదు. నిర్మాణ వ్యవహారాల్లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి పాత్ర ఇంతవరకు ఎక్కడా కనిపించడమే లేదు. భూ సమీకరణ, సేకరణ ప్రకటనలతో ఆశాఖకు నేరుగా సంబంధం ఉన్నా, అవసరమైన పనిని కలెక్టర్‌తో నేరుగా చేయించేస్తుండటం గమనార్హం. పట్టణాభివృద్ధిశాఖలో ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీలను మార్చేశారు. ఆశాఖ మంత్రి నారాయణకు ఇష్టం లేకపోవడం వల్లే ఈ మార్పులు జరిగాయని అధికారులు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కొందరు వ్యాపారులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ సంస్ధలతో వారే అన్నీ మాట్లాడి సమావేశాలు ఒప్పందంలోని అంశాలను సిద్దం చేసేస్తున్నారని ముఖ్యమంత్రి బృందం వాటిని ఖరారు చేసి వస్తోందని ఒక అధికారి వివరించారు.
ప్రతీ పనికీ ముందస్తు పనులు వుండనే వుంటాయి. ప్రజాధనం వినియోగమౌతున్న కార్యక్రమాలన్నిటికీ ప్రిపరేటరీ పనులు చేయడానికి ప్రభుత్వయంత్రాంగం వుంది. దానికి అధికారాలూ, బాధ్యతలూ జవాబుదారీ తనమూ వున్నాయి. అలాంటి యంత్రాంగాన్ని పక్కనపెట్టి ఇంటి వ్యవహారమన్నట్టు సొంత మనుషులతో పూర్తిచేయిస్తున్న సర్కారీ పనులు ఎవరి నెత్తిన విరుచుకు పడిపోతాయో నన్న భయం ఉన్నతాధికారుల్లో వుంది.
రాజధాని పరిధిని తెలంగాణా సరిహద్దు వరకూ విస్తరిస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వహక్కే అయితే నిర్ణయానికి కారణాలను, ప్రయోజనాలను సంబంధిత జిఒ లో వివరించడం ఒక పారదర్శక విధానం. బిటీష్ హయాం నుంచీ దీన్ని పాటిస్తున్నారు. రాజధాని విస్తరణ ఉత్తర్వులో అందుకు కారణాలు ప్రయోజనాల ప్రస్తావన లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రాజధాని వ్యవహారాలన్నీ ప్రస్తుతం అధికార పదవుల్లో వుండి ఒకప్పుడు తెలుగుదేశాన్ని కష్టకాలంలో ఆదుకున్న వ్యాపారుల ప్రాబల్యంతోనే జరుగుతున్నాయన్న విమర్శవుంది.విస్తరించిన ఆ కోటరీ ఇష్టారాజ్యమే రాజధాని రియల్ ‘ఎస్టేట్ నిక్షేపాన్ని’ కాపలాకాసుకుంటోంది. ఏది ఎలావున్నా రాజధాని పరిధి విస్తరణ వల్ల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వర్గం భూముల విలువలు కోటానుకోట్ల రూపాయలౌతాయన్నది కూడా వాస్తవమే!