స్కిల్ కేసులో అసలు సిమెన్స్తో సంబంధం లేదని.. సిమెన్స్ పేరును వాడేసుకున్నారని.. ఆ సంస్థ తమకు చెప్పిందని సీఐడీ ఆరోపిస్తోంది. సాక్షిలో కూడా బ్యానర్ ఐటమ్ గా రాశారు. అందులో సిమెన్స్ తమకు ఈమెయిల్ పంపిందని కూడా చెప్పుకొచ్చారు. ఆ ఈమెయిల్ ను ఎక్కడా ప్రచురించలేదు. కానీ బ్యానర్ పెట్టి రాసేశారు. సిమెన్స్కు సంంబధం లేని ప్రాజెక్టు అని తీర్మానించేశారు. సీఐడీ కూడా నిన్నటిదాకా అదే చెప్పింది. కోర్టులకూ అదే చెబుతోంది.
మరి అదే మాట సిమెన్స్తో కూడా చెప్పించవచ్చు కదా అని ఎవరికైనా సందేహం వస్తుంది. అలా చెప్పించాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పుడు మాట మార్చేశారు. సిమెన్స్ తోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు. ఆ సంస్థకు రూ. 58 కోట్లు అందాయన్నారు. మిగతా సొమ్ము ఎటుపోయింందోనని ఏమీ తెలియనట్లుగా మాట్లాడారు. సిమెన్స్ సాఫ్ట్ వేర్, డిజైన్ టెక్ హార్డ్ వేర్, ట్రైనింగ్ సేవలు అని ఒప్పందంలోనే ఉంది. అది త్రైపాక్షిక ఒప్పందం. ఈ విషయం పేపర్లలోనే ఉంది. ఇప్పటి వరకూ అసలు సిమెన్స్ కు సంబంధం లేదని వాదించిన సీఐడీ.. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ప్రకటన వస్తుందనో.. మరో కారణమో కానీ.. సిమెన్స్కు డబ్బులు అందాయని చెబుతున్నారు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు.
స్కిల్ కేసు విషయంలో కొన్ని వివరాలే చెబుతూ.. కొంత మందినే బాధ్యులుగా చేస్తూ.. కల్లిబొల్లి కాకమ్మ కబుర్లు చెప్పేందుకు సీఐడీ పోలీసులు పడుతున్న పాట్లు చూస్తే ఎవరికైనా నవ్వురాక మానదు. చంద్రబాబు పదమూడు చోట్ల సంతకాలు పెట్టారని చెబుతున్నారు. అవి ఎలా నిబంధనలకు విరుద్ధమో చెప్పాలి కదా. ఆయన చట్టాలను ఉల్లంఘిస్తే ఆ విషయాలు చెప్పారు. ఓ ముఖ్యమంత్రి ఎన్ని వేల సంతకాలు పెడతారో చెప్పాల్సిన పని లేదు. అయినా ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయడానికి సీఐడీ చేసిన ప్రయత్నం విఫలమయింది. సిమెన్స్ విషయంలో చేసిన కుట్ర కూడా బయటపడింది. ఇక కోర్టులో తేలాల్సి ఉంది.