విదేశీపెట్టుబడులను ఆకర్షించడంలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీపడుతున్నట్టున్నారు. ఆయన విదేశాలు తిరిగి కుదుర్చుకున్న ఒప్పందాలను గమనించినా, విదేశీయులే విశాఖ, విజయవాడలు వచ్చి చేసిన ఆమోదాలను విశ్లేషించినా పెట్టుబడులను రాబట్టడంలో మోదీకి, బాబుకి వున్నంత ఫాసినేషన్ మరే ముఖ్యమంత్రికీ లేదేమో అనిపిస్తుంది.
అధికార ప్రకటనల్లో ప్రభుత్వాలు చెప్పుకుంటున్నట్టు ఈ ఎంవోయూలు (ఒప్పందాలు)అప్పటికప్పుడు కుదిరిపోవు. వేరు వేరు స్ధాయుల్లో ఎంతో అధ్యయనాలు, ఎన్నెన్నో సంప్రదింపుల తరువాతే సంతకాలు జరుగుతాయి. సంతకాలు జరిగినవన్నీ ఫ్యాక్టరీలు అయిపోవు. గ్రౌండ్ మీదికి వచ్చాక ఊహించని సమస్యలు ఎదురైతే మొదలే కాకుండా ఆగిపోయే సంస్ధలు వుంటాయి. ఎవరికైనా ఈ కండిషన్లే వర్తిస్తాయి.
రాజధానే లేని రాష్ట్రంలో, ఆర్ధిక సమస్యలున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారంటే ప్రజల కొనుగోలు శక్తులు ఒకకారణమైతే, ఇన్వెస్ట్ మెంట్లకు స్వాభావికంగానే అనుకూల విజనరీ ముఖ్యమంత్రిగా వుండటం మరో కారణం! పరిశ్రమలు పెడుతున్నందుకు వారికి ఇచ్చే రాయతీల్లో మన శాశ్వత ప్రయోజనాలకు హాని కలుగకుండా డీల్ ఎలా ముగిస్తారన్నదే ఒప్పందాల్లో అసలు ప్రశ్న! అది కాలమే తేల్చాలి!
10 వేల కోట్లతో చైనా ఎరువుల ఫ్యాక్టరీ
ముఖ్యమంత్రి చైనా పర్యటన ఆశావహంగానే కనిపిస్తున్నది. ఆవివరాలు ఇక్కడ చూడవచ్చు. పదివేల కోట్ల రూపాయలతో కృష్ణపట్నం వద్ద గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ ని స్ధాపించడానికి చైనాలోని టియాంజిన్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
చైనా హాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పోరేషన్, ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్ఈపీఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏపీఇడీబీ, డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మధ్య సోమవారం ఈ ఒప్పందం కుదిరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
ఈ కర్మాగారం వల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 2017-18 సంవత్సరాల మధ్య ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమవుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన హాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పోరేషన్, చైనా నేషనల్ పెట్రోలియం కార్పోరేషన్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. బీజింగ్ లో హెడ్ ఆఫీసు వున్న ఈ కార్పోరేషన్‌కు చైనాలో రసాయన పరిశ్రమల అభివృద్ధిలో 50 సంవత్సరాల చరిత్ర ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను పెద్ద సంఖ్యలో నిర్మించింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్ సూపర్విజన్ విభాగాల్లో అనుభవం గడించింది. భారీ కర్మాగారాల ఏర్పాటులో సమర్ధతను రుజువు చేసుకున్న అంతర్జాతీయ కంపెనీగా పేరుపొందింది.
మలేషియన్ కంపెనీ ఇసోమెరిక్ హోల్డింగ్స్ గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో నైపుణ్యం, అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎల్ ఈ పీఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాజెక్టులు, రిన్యువబుల్ ఎనర్జీ, ఎయిర్ లైన్స్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో ప్రసిద్ధి చెందిందని ఆ ప్రకటనలో వివరించారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలు, ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారాన్ని ఇవ్వాలని ‘పలంటీర్ టెక్నాలజీస్’ గ్లోబల్ హెడ్ డీవ్ గ్లేజర్ ను కోరారు. అనలిటిక్స్, డేటాబేస్ సైబర్ సెక్యూరిటీ అంశాలలో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. ‘మీ బృందాన్ని ఏపీకి పంపించి మీ దగ్గరున్న సాంకేతికతను మాకు వివరించండి. మాతో కలిసి పనిచేసే అవకాశాల్ని పరిశీలించండి’ అని డేవ్ గ్లేజర్‌కు ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’గా అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని వివరించారు. ప్రతి రంగంలో సాధిస్తున్న ప్రగతిని తాము ‘రియల్ టైమ్’ విధానంలో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు వ్యయాన్ని తగ్గించి, తక్కువ కాలంలో రాష్ట్రానికి ఫైబర్ గ్రిడ్ సేవలు అందించేందుకు తీసుకున్న చొరవ, చేస్తున్న కృషిని వివరించినప్పుడు డీవ్ గ్లేజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అభినందించారు.
లిబ్రా గ్రూపుతో సీఎం సమావేశం
నౌకాయాన, ఆతిథ్య రంగాలలో 9 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లిబ్రాగ్రూప్ గ్రూపు ప్రతినిధి మారిస్ వోవెన్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. లిబ్రా గ్రూపు ఆసియా విభాగపు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. లిబ్రాగ్రూప్నకు నౌకాయాన, ఆతిథ్య రంగాలలో ప్రపంచ స్థాయి కంపెనీ. ఈ కంపెనీకి 85 నౌకలు, 45 హోటళ్లున్నాయి. నౌకాయానం, విమానయానం, పునరుత్పాదక ఇంథన రంగాలపై స్పష్టమైన ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు.
విమానయాన రంగానికి ఆహ్వానం
ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన ముఖ్యమైన కంపెనీల్లో మిత్సుబిషి ఒకటి. మిత్సుబిషికి భారత్‌తో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌తో ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉందని మిత్సుబిషి గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోషీ యుకీ ఇషి, గ్రూపు అడ్వయిజర్ కొయిషి ఇమురా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఓజిన్ కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ వాలరీ ఫెల్డ్‌మన్ కలుసుకున్నారు. పవన విద్యుత్ రంగంలో ప్రసిద్ధిచెందిన ఓజిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భారత్ పునరుత్పాదక రంగాలపై దృష్టి పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ ఈరంగానికి ప్రాధాన్యతనిస్తోందని వివరించారు.
హ్యూలెట్ ప్యాకార్డ్ కు పిలుపు
ఐటి ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్యూలెట్ ప్యాకార్డ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ‘ఏపీ ఆర్ధిక మండలి మీకు సమన్వయకర్తగా ఉంటుంది, మీరు ఆంధ్రప్రదేశ్‌కు రండి’ అని ముఖ్యమంత్రి హ్యూలెట్ ప్యాకార్డ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానించారు.
మణీందర్ మళ్ళీ కలసి పనిచేద్దాం
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎస్ప్రాంజా ఇన్నోవేషన్స్ ఫౌండర్ సీఈవో మణీందర్ బజ్వా సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ సిలబస్‌పై కలసి పనిచేసిన విషయాన్ని బజ్వా గుర్తుచేయగా ముఖ్యమంత్రి స్పందించారు. జూలై మొదటి వారంలో ఏపీలో పర్యటించాలని మణీందర్ బజ్వాను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యారంగంలో ఐటీ ఉత్పత్తులను, సేవల్ని అందించిన తొలితరం ఎంటర్ ప్రెన్యూర్‌గా మణీందర్ బజ్వాకు గుర్తింపు ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం కోరారు. ఏపీలో ఏదైనా ఒక ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టి ఫలితాల్ని తమకు వివిరించాలని మణీందర్ బజ్వాకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
డాంగ్ ఫాంగ్ తో పవర్ వెంచర్
డాంగ్ ఫాంగ్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ తో…ముఖ్యమంత్రితో డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సన్ జెన్ పింగ్ భేటీ అయ్యారు. డాంగ్ ఫాంగ్ చైనాలో అతిపెద్ద ఇంథన పరిశ్రమగా ఉంది. తాము పశ్చిమ బెంగాల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు యూనిట్లను నెలకొల్పినట్టు తెలిపిన జెన్ పింగ్ చంద్రబాబుకు వివరించారు. ఇప్పటికే 40 వేల మెగావాట్ల యూనిట్లకు మిషనరీ అందించామని తెలిపారు. ప్రస్తుతం సౌర విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థగా వున్న డాంగ్ ఫాంగ్ కంపెనీలో చైర్మన్‌కు కేంద్ర మంత్రి హోదా వుంటుందని జెన్ పింగ్ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ పునరుత్పాదక ఇంథన రంగంపప దృష్టిపెట్టామని చెప్పారు. రాబోయే పదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్, 8 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పాదన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో 21 రోజులలోనే పూర్తి పారదర్శకతతో పరిశ్రమలకు అనుమతులు అందిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఉప్పునీటి శుద్ధి రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు జెన్ పింగ్ తెలిపారు. తాము త్వరలో ఏపీని సందర్శిస్తామన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ తమ ప్రభుత్వంతో కలిసి చైనా ప్రభుత్వరంగ కంపెనీగా వున్న డాంగ్ ఫాంగ్ పైలెట్ ప్రాజెక్టుగా జాయింట్ వెంచర్ ఏర్పాటుచేద్దామని ప్రతిపాదించారు. ఈ జాయింట్ వెంచర్‌ను క్రమేణా ఇతర రాష్ట్రాలకు విస్తరిద్దామన్నారు. జీ2జీ ఒప్పందంపై పరిశీలన జరిపి ముందడుగు వేద్దామని ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా.పరకాల ప్రభాకర్, ఈడీబీ సీఈఓ జె. కృష్ణ కిశోర్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సాల్మన్ ఆరోకియా రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.