ఏపీలో విద్యుత్ ట్రూప్ అప్ చార్జీల పేరిట కరెంట్ బిల్లులు బాదేస్తున్నారు. రెండు నెలల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే హఠాత్తుగా ఆ చార్జీల వసూలు ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ఏపీఈఆర్సీ ప్రకటించింది. ఏపీ ఈఆర్సీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచాలన్నా.. తగ్గించాలన్నా.. ట్రూ అప్ లాంటి పేరుతో చార్జీలు వసూలు చేయాలన్నా ఏపీఈఆర్సీ ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. ఇది రాజ్యాంగ బద్ద సంస్థ. దీనికి ముఖ్యమంత్రిగా జగన్ బాద్యతలు చేపట్టిన తర్వాత .. తమక సన్నిహితుడు అయిన మాజీ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డిని చైర్మన్ గా నియమించారు.
ఇటీవల చైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి నేతృతవంలోని ఏపీఈఆర్సీ ప్రజల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చులు అయ్యాయని.. వాటిని ఇప్పుడు వసూలు చేసుకుంటామని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరారియ. దీంతో ఏపీఈఆర్సీ రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతించింది. సెప్టెంబరు నుంచి వీటి వసూలు మొదలైంది.
ఏపీఈఆర్సీ ఎంత రాజ్యాంగ బద్ద సంస్థ అయినా .. ఇష్టారాజ్యంగా పని చేయడానికి ఉండదు. నిబంధనల ప్రకారమే పని చేయాలి. చార్జీలు వడ్డించే నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ఓ ప్రక్రియ పాటించాలి. పేపర్లలో ప్రకటనలు ఇవ్వాలి. ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలి. ఆ తర్వాతనే అనుమతి ఇవ్వాలి. కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలు అడిగారనో మరో కారణమో కానీ ఈ ప్రక్రియ చేపట్టకుండానే ట్రూ అప్ చార్జీలు వడ్డించారు. దీంతో హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనందున హైకోర్టులో ఎదురు దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతో ట్రూ అప్ చార్జీలపై ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు.
అయితే వడ్డింపు మాత్రం ఆపడం లేదు. 19వ తేదీన ప్రజాభిప్రాయసేకరణను తూతూ మంత్రంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేసి.. ఆనక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అంటే వడ్డింపు కొనసాగుతుందున్నమాట. కేవలం కోర్టును సంతృప్తి పరచడానికి రూల్స్ అమలు చేస్తున్నామని చెప్పడానికే ప్రస్తుతం తంటాలు పడుతున్నారు.