తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీని వచ్చే నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు కేంద్ర జలశక్తిశాఖ లేఖలు వెళ్లాయి. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తెలంగాణ సీఎంలు కూడా హాజరవుతారు. ఇప్పటికి రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 5నే సమావేశం జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ వాయిదా కోరారు. ఆ తర్వాత కూడా సమావేశం తేదీని ఖరారు చేశారు.
కానీ రెండు రోజుల ముందు గజేంద్ర షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ సమావేశమూ వాయిదా పడింది. ఇప్పుడు షెకావత్ కోలుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరే అడ్డంకులు రాకపోతే.. ఈ సారి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించడంతో వివాదం ప్రారంభమయింది. ఆ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నీటి కష్టాలు వస్తాయంటున్న కేసీఆర్..కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
ఇలా ఒక్క ప్రాజెక్టుతో ప్రారంభమై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మితమవుతున్న అన్ని ప్రాజెక్టులపై ఒకరినొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. అదే సమయంలో కేసీఆర్ … జల వివాదాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేయడంతో… నేరుగా కేంద్ర జలశక్తి మంత్రినే రంగంలోకి దిగారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి భేటీ ఏర్పాటు చేశారు.