గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన సంఘటనపై జస్టిస్ సోమయాజులు కమీషన్ విచారణ జూన్ 28 కి వాయిదా పడింది. ఇక్కడ విశేషమేమంటే జూన్ 29 తో ఈ ఏకసభ్య కమీషన్ పదవీకాలం జూన్ 29 తో పూర్తవుతోంది.
కమీషన్ నియామకంలోనే విపరీతమైన జాప్యం జరిగింది. నియామకం జరిగాక 6 నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది. ప్రభుత్వాధికారులు సహకరించకపోవడం వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూండగానే కాలం గడచిపోయింది. ప్రభుత్వం మరో 3 నెలలు గడువు పొడిగించింది. ఆగడువు కూడా 29 న ముగిసిపోతుంది.
విఐపిల కోసం ప్రత్యేక ఘాట్లు వున్నప్పటికీ వేల మంది కక్కిరిసిపోయివున్న పుష్కరఘాట్ వద్ద ముఖ్యమంత్రి గంటకు పైగా వేచి వుండటమే తొక్కిసలాటకు కారణమని, పుష్కరాలు ముగిసిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోగలమనీ ప్రకటించిన ముఖ్యమంత్రి అధికారులందరికీ సన్మానాలు చేయడం వెనుక విషయాన్ని దాచిపెట్టే ఉద్దేశ్యం వుందని కమీషన్ ముందు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, న్యాయవాది ముప్పాళ సుబ్బారావు వాంగ్మూలాలు ఇచ్చారు.
జనసమూహాల మధ్యనుంచి చంద్రబాబు నాయకుడై వస్తున్న రియల్ మూవీ షాట్లను చిత్రీకరించడం కోసమే హెచ్చుమంది వుండే పుష్కరఘాట్ లో ముఖ్యమంత్రి అంత సేపు వుండి తొక్కిసలాటకు కారకులయ్యారని వారు కమీషన్ ముందు ఆరోపించారు. ఆ మరణాలకు బాధ్యులెవరో ప్రకటించాలని వారు కమీషన్ ని కోరారు.
ముఖ్యమంత్రిని, జిల్లాకలెక్టర్ ను కమీషన్ ముందుకి పిలిచి క్రాస్ ఎగ్జామ్ చేయాలని వారు కమీషన్ నుకోరారు. తమ ప్రశ్నలకు ఆధారంగా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా అధాకారులు టివిలలో మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కమీషన్ ముందు ప్రదర్శించారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా సమన్ చేయగలమని జస్టిస్ సోమయాజులు చెప్పారు
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వున్నాయని మొదట్లోనే అఫిడవిట్ ద్వారా కమీషన్ కు తెలియజేసిన అధికారులు విచారణకు రావడంలేదు. కమీషన్ లో నమోదైన ప్రశ్నలకు సమాధానం కావాలని జస్టిస్ అడగగా ”మూడు వారాలు వాయిదా కావాలని ప్రభుత్వ న్యాయవాది అడిగారు. 29 తో కమీషన్ గడువు ముగుస్తూండగా 3 వారాల గడువు ఎలా సాధ్యం? 28 కి వాయిదా వేస్తున్నాను. అప్పుడు అధికారులు ఆధారాలతో సమాధానాలు ఇవ్వాలి ‘ అని జస్టిస్ సోమయాజులు ఆదేశించారు.
దీంతో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కమీషన్ పదవీ కాలాన్ని మరో మూడునెలలు పొడిగించాలని ప్రభుత్వానికి రాశారు. రాజకీయ నాయకత్వం సూచనవల్లో, తీరికలేకపోవడం వల్లో కమీషన్ కు సహకరించకుండా కాలయాపన చేస్తున్న జిల్లా యంత్రాంగం సూచన మేరకు కమీషన్ గడువు పొడిగించడం మినహా ప్రభుత్వానికి ఇంకోదారిలేదు.
కమీషన్ గడువు పొడిగించకపోతే ” జిల్లా అధికారులు అఫిడవిట్ లో చెప్పినట్టు ఆధారాలు చూపలేదు.సమాధానాలు ఇవ్వలేదు” అని కమీషన్ నివేదికలో నమోదైపోతుంది. ప్రభుత్వానికి అది పెద్ద అప్రతిష్ట కనుక కమీషన్ గడువు పెరుగుతుంది….ముప్పాళ సుబ్బారావు, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు ”ఇదంతా చిత్తశుద్ది లేని ప్రభుత్వ కాలయాపన తప్ప ఇంకేమీ కాదు”