తగలబెట్టేస్తున్న మొక్కజొన్న కుదుళ్ళను జాగ్రత్తగా పెకలించి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా పశువులకు రుచికరమైన పౌష్టిక దాణాగా మార్చే ప్రక్రయను పబ్లిక్, ప్రయివేట్, పీపుల్స్ – పిపిపి భాగస్వామ్యంతో భారీ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నెరవేరితే లక్షటన్నుల పశువుల మేత ఉత్పత్తి అయ్యి పశుగ్రాసానికి కరువు వుండదన్నది అధికారుల అంచనా.
పశువులకు అవసరమైన దాణాలో 40 శాతానికిపైగా కొరత వున్నట్టు ఈ ప్రాజెక్టు ప్రాతిపదికలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఆ వివరాల ప్రకారం…కొరత అధిగమించే చర్యల్లో మొక్కజొన్న సాగు పెంపు ముఖ్యమైంది. 13 జిల్లాల్లోనూ ఖరీఫ్, రబీ సీజన్లలో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. రబీలో ఈ సాగు ఎక్కువ. ప్రస్తుతం రబీలో 6 నుంచి 8 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా సమీప భవిష్యత్తులో పదహారున్నర లక్షల ఎకరాలకు సాగు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. వరిగడ్డితో పోల్చితే మొక్క జొన్న చొప్పలో పశువులకు అవసరమైన పోషకాలు అధికం. వరి సేద్యానికి అవసరమ్యే నీటిలో 16-20 శాతం మొక్కజొన్నకు చాలు. కరువు సమయంలో తక్కువ నీటితో అధిక పంట పండే మొక్కజొన్న సాగును ప్రోత్సహించాలని ఆ నివేదిక సిఫార్సు చేసింది.
రాష్ట్రంలో 60 లక్షలకు పైబడిన చిన్న కమతాల రైతులు తిండి గింజలే పండిస్తున్నారు తప్ప పశువుల దాణాను పండించడం లేదు.ఇందువల్ల పశుగ్రాసాన్ని పండించి దాణాగా ప్రాసెస్ చేసే భారీ ‘సైలేజీ’ లను ప్రారంభిస్తారు. సైలేజి అంటే గ్రాసాన్ని పశువులు తినడానికి అనువుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్రత్యేకంగా రూపొందించిన సంచుల్లో ప్యాక్ చేస్తారు. పొలం నుంచి పశువుల పాకలకు సులువుగా రవాణ చేసేందుకు సైలేజి ఉపకరిస్తుంది. సైలేజి కోసం భారీ బంకర్లు అవసరం. సైలేజి బేలర్స్, హే బేలర్స్, దాణా తయారీ యూనిట్లు, పెద్ద పెద్ద చాఫ్ కట్టర్లు, హార్వెస్టర్లు, ఇరిగేషన్‌కు అవసరమైన పరికరాలు కావాలి.
సైలేజికి మొక్కజొన్న సరఫరా చేయడానికి రైతులు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. పశుగ్రాసం కోసం కేటాయించిన నిధులను ఈ కంపెనీలకు సబ్సిడీల రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. పశగ్రాసం ఉత్పత్తి చేసే కంపెనీల యంత్రాలకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీగా, మేత సరఫరా చేసినందుకు 25 శాతం మార్జిన్ మనీగా,, మరో 25 శాతం అడ్వాన్స్‌గా ప్రభుత్వమే అందిస్తుంది. రైతుల నుంచి మొక్కజొన్న పంటను కంపెనీలు సేకరించి అధునాతన పద్ధతుల్లో దాణా తయారు చేసి పశువులున్న రైతులకు సరఫరా చేస్తాయి.
ఈ ప్రాజెక్టు తొలిదశగా 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తారు. ఆయా పొలాల రైతులు తమప్రాంతం లో సైలేజీ లు నిర్వహించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఆప్రకారం వారు పండించే మొక్కజొన్నను ఆయా కంపెనీలకే సరఫరా చెయ్యాలి.
మొక్కజొన్న పంట కోశాక పొలంలో కొంత మేత మిగిలిపోతోంది. రైతులు తదుపరి సాగు కోసం ఆ మిగిలి పోయిన అవశేషాలను కాల్చేస్తున్నారు. ఈ విధంగా ఎకరాకు రెండు టన్నుల మేత వృధా అవుతోంది. వృధా అవుతున్న మేతను అధునాతన పద్ధతుల్లో యంత్రాలతో కంపెనీలు సేకరిస్తాయి. దీని వలన లక్షల టన్నుల మేత అందుబాటులోకొస్తుందని, పశుగ్రాసం కొరత తీరుతుందని కూడా నివేదిక వివరిస్తోంది.
ఈ సందర్భంగా ఆయిల్ పామ్ రైతుల అనుభవాలను గుర్తుచేసుకోవాలి. ఆయిల్ పామ్ కాయలను గానుగ ఆడి నూనెతీసే సంస్ధలకు ప్రాంతాల వారీగా ఫ్యాక్టరీల లైసెన్సులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రాంతాల వారీగా కంపెనీలు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆప్రకారమే పంటను సరఫరా చేయాలి. దానిపై మార్కెట్ ధర రైతులకు చెల్లిస్తారు. మొదట్లో టన్ను ఆయిల్ పామ్ కి 9 వేలరూపాయల ధర ఇచ్చేవారు. ఇపుడు అది 5 వేల రూపాయలకు పడిపోయింది. అది గిట్టుబాటు కాకపోయినా రైతు చేసేది లేదు. అగ్రిమెంటు ప్రకారం అదే కంపెనీకి పంటను ఇవ్వవలసిందే. మార్కెట్ ధర ను నిర్ణయించేది సిండికేట్ అయిపోయిన కంపెనీలే కనుక ఇచ్చింది తీసుకోవడం మినహా రైతుకి మరో ప్రత్యామ్నాయం లేదు.
ఇపుడు మొక్కజొన్న రైతులుకూడా ఆయిల్ పామ్ రైతుల పక్కకి చేరిపోతున్నారు. పశుగ్రాసాన్ని పండించేది రైతు. దాన్ని సైలేజిలో ప్రాసెస్ చేసి పశువుల దాణాగా రైతులకి అమ్మేది కంపెనీలే! గడ్డిధర నిర్ణయించేదీ, దాణాగా మార్చాక అమ్మకం ధరను నిర్ణయించేదీ కంపెనీలే!! ఇక్కడ కనీస మద్దతు ధర అన్న రక్షణ లేకపోవడం వల్ల రైతు పరిస్ధితి తనపొలంలో తానే కూలి పుచ్చుకుని కంపెనీకోసం మొక్కజొన్న పండించడంగా మారిపోతూంది.