మన దేశంలో హాస్పిటల్స్‌లో జరిగిన, జరుగుతూ ఉన్నన్ని మాయలు ఇంకెక్కడా జరగవేమో. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకూ అందరూ కూడా మన కార్పొరేట్ హాస్పిటల్ మాయా ప్రపంచంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారే. కాల్పుల కేసులో నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో ఉన్నప్పుడు, నిమ్స్‌లో కెసీఆర్ దీక్ష చేసినప్పుడు అయితే ఆ డ్రామా అంతా కూడా థ్రిల్లర్ సిినిమాని మించిన స్థాయిలో ఉండేది. అఫ్కోర్స్ మాంచి కామెడీ కూడా ఉండేది.
ఇప్పడు జయలలిత విషయంలో కూడా అపోలో హాస్పిటల్ వారు అలాంటి కామెడీనే పండిస్తున్నారు. చాలా చిన్న సమస్యతోనే జయలలిత హాస్పిటల్లో చేరారని మొదట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో పూర్తిగా చివరి దశలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే బాగుండేదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి. మరి చివరి స్టేజ్ వరకూ జయలలిత హాస్పిటల్‌కి రాలేదు, ముందుగా వచ్చి ఉంటే బాగుండేది అని డాక్టర్స్ చెప్తున్న మాటలు నమ్మాలా? తప్పును జయలలితపైకి నెట్టేస్తున్నారా? సినిమా ఫీల్డ్‌లో ఉన్నప్పటి నుంచీ కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట జయలలిత. మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హెల్త్‌ని నెగ్లెక్ట్ చేశారంటే నమ్మశక్యమయ్యే మాటేనా?
ప్రభుత్వం వివరణ ఇమ్మంటేనే ఇప్పుడు వివరణ ఇస్తున్నామని అపోలో డాక్టర్స్ చెప్పారు. అంటే శశికళ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఆమెకు ఇబ్బుందులు లేకుండా ఉండేలా, జయలలిత మరణం విషయంలో ఆమె తప్పు ఏమీ లేదని చెప్పడానికి అపోలో డాక్టర్లు మీడియా ముందుకు వచ్చారా? అలా అయితే వాళ్ళు శశికళ వాయిస్‌ని వినిపిస్తున్నారని అనుకోవాలా? లేక నిజాలు చెప్తున్నారని నమ్మాలా? ఇక హాస్పిటల్ బిల్లు విషయంలో కూడా ఇప్పుడు అపోలో డాక్టర్స్ చెప్తున్న మాటలకు……చాలా కాలం క్రితం అపోలో ప్రతాప్ రెడ్డి చెప్పిన మాటలకు అస్సలు పొంతనే లేదు. హాస్పిటల్ బిల్లు 5.5 కోట్లు అయిందని, జయలిలత కుటుంబ సభ్యులు ఆ బిల్లు చెల్లించారని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ అపోలో ప్రతాప్‌రెడ్డి మాత్రం జయలలితకు ట్రీట్మెంట్ చేసిన ఖర్చులను మేమే భరిస్తాం. జయలలితకు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేశాం అని చెప్పుకొచ్చారు. మరి ఛైర్మన్ మాటలు నమ్మాలో…లేక అపోలో డాక్టర్స్ మాటలు నమ్మాలో అపోలో వారే చెప్పాలి. హాస్పిటల్ వర్గాల నుంచి ఇన్ని రకాల మాటలు వస్తున్నాయి కాబట్టే జనాలకు, పరిశీలకులకు కూడా జయ మరణంపై బోలెడన్ని అనుమానాలు వస్తున్నాయి. అపోలో వారి వివరణలన్నీ కూడా ఆ అనుమానాలను పెంచేలా ఉన్నాయి తప్పితే నమ్మేలా మాత్రం అస్సలు లేవన్నది మెజారిటీ వర్గాల మాట. మరి జయలలిత అనారోగ్యం, ట్రీట్మెంట్ రహస్యాలు కోర్టు విచారణల్లో అయినా బయటపడతాయోమో చూడాలి.