ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉండి.. వివాదాస్పద పరిస్థితుల్లో… పదవి పోగొట్టుకున్న సీనియర్ నేత … ఎన్డీ తివారీ కుమారుడు .. రోహిత్ శేఖర్… అంతే వివాదాస్పద స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన ప్రాణం తీసింది… కట్టుకున్న భార్యే. యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నరు ఎన్ డి తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో మిస్టరీ వీడింది. రోహిత్ తివారీని అతని భార్య అపూర్వ శుక్లా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రోహిత్ దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిందని పోలీసుల ఇంటరాగేషన్ లో వెలుగుచూసింది. క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించిన ఈ కేసులో నిందితురాలైన అపూర్వ గోళ్లు, వెంట్రుకలను పరీక్షకు పంపించగా రోహిత్ తో పెనుగులాడి హతమార్చిందని తేలింది.
రోహిత్ మద్యం మత్తులో ఉండగా ఆమె దారుణానికి పాల్పడింది. ఆయన గుండెపోటుతో మరణించారని.. పోలీసులు అనుకున్నారుకానీ.. ఊపిరాడకపోవడంతోనే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించినట్లు ఆధారాలు లభించకపోవడంతో ఈ హత్య వెనక ఇంట్లోవారి హస్తముందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అపూర్వను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో అపూర్వ పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఘటన జరిగిన సమయంలో ఇంటి సమీపంలోని సీసీ కెమేరాలు పనిచేయకపోవడంతో పోలీసుల అనుమానాలను మరింత బలపడ్డాయి. హత్య చేసిన గంటన్నరలో అపూర్వ సాక్ష్యాలను చెరిపేసింది.
రోహిత్ తివారీకి అపూర్వ 2017లో ఆన్ లైన్ వివాహ వేదిక ద్వార పరిచయమైంది. రోహిత్ అపూర్వను మొదటిసారి లక్నోలో కలిసి ఏడాది పాటు సహ జీవనం చేశాక, గత ఏడాది మే 12వతేదీన వివాహమాడారు. గతంలో భర్త రోహిత్ తివారీతో ఘర్షణ పడిన అపూర్వ తన పుట్టింటికి వెళ్లి మార్చి 30 వతేదీన తిరిగి వచ్చింది. .పెళ్లికి ముందు నుంచి ఉన్న బాయ్ ఫ్రెండ్ తో అపూర్వ పెళ్లయ్యాక కూడా సంబంధాలు కొనసాగించిందని పోలీసులు తేల్చారు. దీనిపై ఇద్దరికీ గొడవలయ్యేవి. హత్యకు కూడా అదే కారణమని భావిస్తున్నారు. రోహిత్ శేఖర్‌ను.. ఎన్డీ తివారీ మొదట కుమారుడిగా అంగీకరించలేదు. తర్వాత డీఎన్ఏ పరీక్షలు కోర్టు ద్వారా చేయించడంతో అంగీకరించాల్సి వచ్చింది.