ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని కియా కార్ల పరిశ్రమ రూపంలో… ఆకర్షించింది. ఆ సక్సెస్ స్టోరీ అలా ఉండగానే.. మరో వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లాలో.. అంతకు మించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించినంత పని చేసింది. దాదాపుగా రూ. 24వేల కోట్ల పెట్టుబడి… ఏపీపీ అనే విదేశీ కంపెనీ పేపర్ మిల్లు ఏర్పాటు చేసేందుకు.. ఏపీ సర్కార్‌తో.. కొన్నాళ్ల కిందట.. ఎంవోయూ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే హఠాత్తుగా.. ఆంధ్రప్రదేశ్‌లో తమ పెట్టుబడి ప్రణాళికల్ని రద్దు చేసుకుంటున్నట్లుగా.. ఏపీపీ ప్రకటించింది.
ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్ప్ అండ్ పేపర్స్ గత జనవరిలో ప్రకాశం జిల్లాలో కాగితపు పరిశ్రమ పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఏపీపీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సురేశ్ కిలం-నాటి ఏపీఈడీబీ సీఈవోల మధ్య దీనిపై ఎంవోయూ కూడా కుదిరింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని జాతీయ మీడియా కూడా.. ప్రశంసించింది. ఇప్పటికే ఆసియా పల్ప్ అండ్ పేపర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించింది. తొలిదశలో రూ.24,000 కోట్ల పెట్టుబడితో 15వేల మందికి ఉపాధి కల్పించడం ద్వారా 30 లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కియా కన్నా పెద్దది… పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని.. ప్రకాశం జిల్లా యువత ఆశ పెట్టుకునేలోపలే.. పరిశ్రమ ఆగిపోయిందనే సమాచారం వచ్చేసింది.
ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా.. రైతులు ఎక్కువగా సుబాబుల్, సరుగుడు తోటలను పెంచుతూంటారు. పేపర్ పరిశ్రమకు ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమ వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని.. ప్రభుత్వం అంచనా వేసింది. నేరుగా 60 వేల మంది రైతులతో ఒప్పందం చేసుకోవడం వల్ల వారికి నిరంతర ఆదా య మార్గాన్ని చూపినట్లు అవుతుందని ప్రభుతవం అంచనా వేసింది. కాగితం తయారీ రంగంలో ఆసియా పల్ప్ అండ్ పేపర్ సినార్మస్ సంస్థకు ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 80ఏళ్లుగా పేపర్ తయారీతో పాటు ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఈ సంస్థ తయారుచేసే కాగితానికి దాదాపు 120దేశాల్లో మార్కెటింగ్ చేసుకుంటోంది. ఏపీపీ ఏ కారణాల రీత్యా… ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడి ప్రణాళికలను ఉపసంహిరించుకుందో తెలియాల్సి ఉంది.