అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఇరవై ఒక్క రోజుల్లోగా ఊరి శిక్ష వేసే చట్టాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది.. ఈ విషయంపై.. జగన్కు ఇప్పటికే అభినందనలు తెలిపారు. తాజాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు.. నేరుగా ఓ లేఖను జగన్కు పంపారు. మంచి నిర్ణయం తీసుకున్నారని.. బిల్లు ప్రతిని పంపారని.. కేజ్రీవాల్ కోరారు. రెండు రోజుల కిందట.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా… దిశ చట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణలో దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. అప్పట్లో నిర్భయ ఘటనకు మించి ప్రజల్లో కదలిక వచ్చింది. నిందితుల్ని కాల్చి చంపాలనే డిమాండ్లు వినిపించాయి. దానికి తగ్గట్లుగానే వారు ఎన్కౌంటర్ అయిపోయారు. అయితే.. చట్ట ప్రకారం.. అలాంటి వారిని శిక్షించాలన్న ఉద్దే్శంతోనే… జగన్ సర్కార్.. ఆ ఘటన తన రాష్ట్రంలో జరగకపోయినప్పటికీ.. దేశంలో ఏ రాష్ట్రం కూడా స్పందించనట్లుగా.. స్పందించారు. తక్షణం దిశ చట్టం చేశారు. అసెంబ్లీలో ఆమోదించారు.
అయితే.. ఈ చట్టం అమలుపై.. న్యాయనిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఒక్క రోజుల్లో దర్యాప్తు, విచారణ ఎలా పూర్తవుతుందని.. ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను నిర్ధారించడానికే… చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు. అయితే.. అంచనాలను తలకిందులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తాము ఆమోదించిన చట్టంతో.. రేప్ నిందితులకు ఉరిశిక్ష విధించి చూపిస్తారంటున్నారు.