తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం అడిగినంత పెట్టాలనడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేయడం మంచి అంశాలు. వాటిని అమలు చేయడంలో కూడా పాక్షికత్వం పరిమితులు వున్నా మౌలికంగా మంచి నిర్ణయాలు. అదే కోవలో ఇటీవల బాలింతలకు 12 వేల మేరకు ప్రభుత్వం మందులు అవసరాలు ఆహారం అందించాలని నిర్ణయించారు. అంతేగాక అమ్మాయిని కంటే మరో వేయి ఎక్కువగా ఇవ్వాలని కూడా నిర్దేశించారు. నిస్పందేహంగా ఇది ఆహ్వానించదగిన విధానం. ఈ కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాలని కూడా చెప్పడం బట్టి వాటిని మెరుగు పరుస్తారని ఆశించాలి. బాలింతలకు ఇచ్చే కిట్‌కు కెసిఆర్ కిట్ అని పేరు పెట్టడం చంద్రన్న బీమాను గుర్తు చేసినా సరే నిర్ణయం మంచిది. అంగన్వాడీలను కూచోబెట్టుకుని జీతం10500 కు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించగా ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేశారు. అంగన్వాడీలను సంఘటిత పర్చిన నాయకులను సంస్థలను రాకుందా చేయడం లో రాజకీయం వున్నా జీతాలు పెంచడం మాత్రం అవసరమైన పని. వాస్తవానికి ఆ సంఘాలు వచ్చినా ఘనత ప్రభుత్వానికే దక్కేది కదా!