పెగాసెస్ సాఫ్ట్ వేర్ తో మీ ఫోన్లపై నిఘా ఉందని, మీరేం మాట్లాడుకుంటున్నారో వింటున్నారన్న చర్చ ఎంతోకాలంగా సాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయాలను కుదిపేస్తుండగా… దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలంతా ఫోన్ ట్యాప్ అవుతుందని ఆరోపిస్తున్న తరుణంలో ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేశంలోని రాజకీయ, సినీ, వ్యాపార, జర్నలిస్టులపై పెగాసెస్ వంటి మెర్సినరీ స్పైవేర్ దాడులు జరుగుతున్నట్లు యాపిల్ కంపెనీ తన యూజర్లకు అలర్ట్ పంపింది. ఇది కొద్దిమందిపైనే అయినప్పటికీ దీని వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ అని హెచ్చరించింది.
ఈ కొత్తరకం సాఫ్ట్ వేర్ వాట్సాప్ లో ఒక్క మిస్డ్ కాల్ తోనే ఫోన్ ను ఆధీనంలోకి తీసుకుంటుందని, చాలా తక్కువ టైంలో ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నందున దాడి చేసిన వారు ఎవరో కూడా కనిపెట్టడం కష్టమవుతుందని యాపిల్ హెచ్చరించింది.
గతంలోనూ చాలా మందికి యాపిల్ కంపెనీ అలర్ట్ పంపింది. మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఆ మెసెజ్ సారాంశం. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇప్పుడు యాపిల్ అలర్ట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, దీని నుండి బయట రక్షించుకునేందుకు కంపెనీ కీలక సూచనలు చేసింది. ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ లలో లాక్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించింది. ఇలాంటి స్పైవేర్ అటాకింగ్ పై యాపిల్ ఇంటర్నెట్ థ్రెట్ ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు పనిచేస్తుందని కంపెనీ తన యూజర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.