ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో పొత్తులకు లేకుండా సోలోగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. ప్రత్యేక హోదానే ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో హోదా భరోసా యాత్రను కూడా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలో మూడు రోజులపాటు జరిగిన నియోజక వర్గాల సమన్వయకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాన్ని దాదాపు ఖరారు చేశారు. ప్రచారం వరకూ ఓకేగానీ…. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాలకు అభ్యర్థులు ఎవరనేదే ఇంకా స్పష్టత రాని అంశంగా మిగులుంది.
కాంగ్రెస్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఆశిస్తున్నవారంతా దరఖాస్తులు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకూ ఆశావహులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పదో తేదీ వరకూ వచ్చే అప్లికేషన్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామనీ, వాటిని నేరుగా ఏఐసీసీకి పంపిస్తామన్నారు. ఏదో ఒక పార్టీని గెలిపించడానికో, లేదా ఓడించడానికో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదనీ, ఆంధ్రాలో గెలుపే లక్ష్యంగా సొంత బలంతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని రఘువీరా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపి, ప్రత్యేక హోదా హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ కి పూర్వవైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ హామీకి ఏపీ ప్రజలను కొంత ఆకర్షిస్తుందన్నది వాస్తవం. అయితే, ఈ ఒక్క హామీతోనే కాంగ్రెస్ కి ఏపీలో పూర్వ వైభవం వస్తుందన్న భరోసా టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో ఎంతవరకూ నమ్ముతారనేదే ప్రశ్న..? ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు అనగానే చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకి వెళ్తున్న పరిస్థితి. ఇక, కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఆశించేవారికి స్ఫూర్తి ఎక్కడ్నుంచి వస్తుంది..? ఇంకోటి, ఏపీలో టీడీపీ, వైకాపా తరువాత టిక్కెట్ల కోసం మూడో ఆప్షన్ గా జనసేన కనిపిస్తోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించే కంటే ముందు… ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారి మూడో మజిలీగా ఏపీ కాంగ్రెస్ ని నిలిపే ప్రయత్నం హైకమాండ్ చెయ్యాలి. ఇంకోటి… ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ చెయ్యాల్సింది ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం కాదు, టీడీపీ లేదా వైకాపా నుంచి కనీసం కొందరినైనా కాంగ్రెస్ లోకి రప్పించగలిగితే… ఆశావహుల్లో భరోసా పెరిగే అవకాశాలుంటాయి.