ఆంధ్రప్రదేశ్ సర్కార్ .. వైరస్‌ను ఎలా నియంత్రించాలనే దాని కన్నా ఎక్కువగా ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని.. ఉన్న పళంగా .. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ.. తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో తేలిపోయింది. ఆ ఆర్డినెన్స్ ఎప్పుడు ప్రిపేర్ చేశారో ఎవరికీ తెలియదు. గవర్నర్ వద్దకు ఎప్పుడెళ్లిందో తెలియదు. ఆయన ఎప్పుడు ఆమోద ముద్ర వేశారో కూడా తెలియదు. కానీ.. ఆర్డినెన్స్ ఆమోద ముద్ర పడిందని మీడియాకు లీక్ ఇచ్చారు. ఓ రెండు జీవోలు కూడా.. ఇచ్చారు. వాటిని సీక్రెట్‌గా ఉంచి అందులో ఏముందో మీడియాకు లీక్ చేశారు.
జీవోలు సీక్రెట్‌గా ఎందుకు..? కోర్టుకెళ్తారనే భయమా..?
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవి కాలన్ని తగ్గిస్తూ.. తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చిన రెండు జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. కానీ అందులో ఏముందో.. ప్రభుత్వ వర్గాలు మీడియా ప్రతినిధులకు నేరుగా చెప్పేశాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించి… కనకా రావు అనే రిటైర్డ్ జడ్జిని నియమించినట్లుగా అందులో ఆ జీవోల్లో ఉందని చెబుతున్నారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇది సీక్రెట్‌గా ఎందుకు ఉంచారో… రాజకీయవర్గాలకు మాత్రం క్లారిటీగా తెలుసు. ఆ జీవో ప్రతి ఉంటే.. ఎవరైనా కోర్టుకు వెళ్తారు. అలా వెళ్లే అవకాశం లేకుండా.. కాన్ఫిడెన్షియల్ పేరుతో గుప్తంగా ఉంచారు. కానీ అందులో విషయాలను మాత్రం బయట పెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చే వరకూ ఎవరూ కోర్టుకెళ్లలేరు. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తొలగిస్తూ.. ఇదే ట్రిక్ ప్లే చేశారు. జీవో వచ్చిన తర్వాత ఆయన కోర్టుకెళ్లేలోపు.. అక్కడ ప్రమాణస్వీకారం కూడా పూర్తయిపోయింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలోనూ అదే ట్రిక్ ప్లే చేసింది ఏపీ సర్కార్.
కొత్త ఎస్ఈసీని నియమిస్తున్నట్లుగా జీవో జారీ చేస్తే పని అయిపోయినట్లేనా..?
ఓ సీక్రెట్ జీవో ద్వారా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేసి.. రిటైర్డ్ జడ్జి కనగరాజుని నియమించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక కనగరాజునే.. స్టేట్‌ఎలక్షన్ కమిషనరా.. అంటే.. అలా అనుకుంటే.. అంతకు మించిన అమాయకులు ఎవరూ ఉండరనే అభిప్రాయం… అటు రాజకీయవర్గాల్లోనూ.. ఇటు న్యాయనిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధ పదవి. నియమించాలన్నా.. తీసేయాలన్నా.. కొన్ని నిబంధనలు ఉంటాయి. జీవోలతో అయ్యే పని కాదు. ముందుగా… స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని మారుస్తూ తీసుకొచ్చిన చట్టం… ఇక్కడ ప్రస్తుత ఎస్ఈసీకి వర్తించదు. ఈ సింపుల్ విషయం ఎందుకు.. ప్రభుత్వానికి .. ప్రభుత్వ పెద్దకు అర్థం కాలేదో.. అనేది చెట్టు కింద ప్లీడర్లకు కూడా డౌట్‌గా ఉంది.
ఇప్పుడు చట్టం చేస్తే.. కొత్త నియామకాలకే వర్తిస్తుంది..!
ఎస్ఈసీ రమేష్ కుమార్.. రాజ్యాంగంలోని 243K ఆర్టికల్ ప్రకారం నియమితులయ్యారు. దాని ప్రకారం.. ఆయనకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఏపీ సర్కార్ .. దాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ.. ఆర్డినెన్స్ తీసుకు రావడం అసాధ్యం. రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తయిన తర్వాత కొత్తగా నియమితులయ్యే వారికి ఆ ఆర్డినెన్స్‌ను చట్టంగా మారిస్తే వర్తిస్తుంది. ఇప్పటికైతే రమేష్‌కుమార్‌కు ఆ ఆర్డినెన్స్ వర్తించదు. ఆయనను తొలగించడం అసాధ్యం. కోర్టుకెళ్తే.. ప్రభుత్వానికి మొట్టికాయలు… ఇంకా గట్టి దెబ్బలు తప్పవని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఐవైఆర్ కృష్ణారావు కూడా అదే చెబుతున్నారు. రాజ్యాంగంపై కనీస అవగాహన ఉన్న వారు కూడా అదే చెబుతున్నారు.
అంతిమంగా అభాసు పాలు కావడానికే ..! ఇంతకీ సలహాదారులెవరో..?
ఎస్ఈసీ రమేష్ కుమార్ మీద.. ప్రభుత్వాధినేతకు.. అలవి మాలిన కోపం ఉండవచ్చు. అందుకే .. ఆయనను ఏదో చేసేద్దామని సలహాలిచ్చి.. జగన్ వద్ద మార్కులు కొట్టేద్దామనే సలహాదారులు కొంతమంది అత్యుత్సాహంతో చేసిన ప్రయత్నంగా ఇది కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎస్ఈసీ నిర్ణయం కరెక్టేననిపించారు. రాజ్యాంగ పరంగా వ్యతిరేకంగా ఉందన్న ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న ఎస్ఈసీ తొలగింపు నిర్ణయాన్ని హైకోర్టు నిలిపివేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది. అదే జరిగితే.. వ్రతం చెడుతుంది.. ఫలితం దక్కదు. అయినా ఏదయితే అదయిందని.. ముందుకే వెళ్తామని జగన్‌కు సలహాలిస్తున్న పెద్దలెవరో..?