లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో అంతకుముందే పీసీసీ అద్యక్షుడి నియామకం పూర్తి చేయాలని అధిష్టానం యోచిస్తోంది. త్వరలోనే పీసీసీ అద్యక్ష పదవికి రేవంత్ రాజీనామా చేయనుండటంతో ఆశవాహులు పీసీసీ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో పీసీసీ బాధ్యతలను ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ వర్గాలలో ఏదైనా ఒక సామాజిక వర్గానికి దక్కుతుందని నేతలు భావిస్తున్నారు. అయితే, రెడ్డిలకే పీసీసీ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తే తను పోటీలో ఉంటానని సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు, పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు కానీ, ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ కష్టమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దాంతో ఆయన పీసీసీ అయిన ఇవ్వాలని కోరే అవకాశం ఉందని టాక్.
ఎస్సీ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాల్సి వస్తే భట్టి తనకు ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన భట్టికి డిప్యూటీ ఇవ్వడంతో అదనంగా తనకు పీసీసీ అద్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, సంపత్ పేరు కూడా తెరపైకి వస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సీటు ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. రేవంత్ బుజ్జగింపులతో సంపత్ కుమార్ వెనక్కి తగ్గారు. ఏఐసీసీ కార్యదర్శిగా కూడా కొనసాగుతోన్న ఆయన తనకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు.
బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ ముగ్గురూ కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మధు యాష్కీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అలాగే మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ లకు రేవంత్ మద్దతు ఉండొచ్చునని చర్చ జరుగుతోంది. వీరిలో రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ పేరు పరిశీలనలో ఉండగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్కకు పీసీసీ పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.