గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్ లను ఎపీపీఎస్సీ పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక లేఖను కూడా పట్టించుకోలేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున.. ప్రభుత్వం గ్రాడ్యూయేట్లకు మేలు చేసేలా చేసిన సూచనను తాము పాటించలేమని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష యాథాతథంగా జరగనుంది.
ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్దమైనది. ప్రభుత్వం సిఫారసు మేరకు గవర్నర్ నియమిస్తారు. ఏపీపీఎస్సీ చైర్మన్ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. గవర్నర్ కు మాత్రమే రిపోర్టు చేశారు. వైసీపీ హయాంలో గౌతం సవాంగ్ ను డీజీపీగా సర్వీస్ నుంచి హఠాత్తుగా రిజైన్ చేయించి.. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారు. టీడీపీ గెలవగానే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ అనూరాధను సిఫారసు చేసింది. గవర్నర్ నియమించారు. అయితే చైర్ పర్సన్ అనూరాధ ఇప్పుడు కోడ్ కారణంగా ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
ఇటీవలి కాలంలో ఎలాంటి పరీక్షలు జరిగినా ఏదో ఓ వివాదం రేపి.. కోర్టులకు వెళ్లడం.. పరీక్షల్ని వాయిదా కోరడం సహజంగా మారిపోయింది. తెలంగాణలోనూ అంతే. అందుకే పరీక్షల వాయిదా డిమాండ్లను పట్టించుకోకూడదని ఆయా రిక్రూట్ మెంట్ సంస్థలు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేరుగా ప్రభుత్వం రాసిన లేఖను ఎపీపీఎస్సీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది.