Appudo Ippudo Eppudo movie review
తెలుగు360 రేటింగ్: 1.5/5
‘స్వామిరారా’తో హీరోగా నిఖిల్, డైరెక్టర్ గా సుధీర్ వర్మ నిలబడ్డారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘కేశవ’ గురి తప్పింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ వచ్చింది. నిజానికి ఎప్పుడో రావాల్సిన సినిమా ఇది. ఎప్పుడు మొదలుపెట్టి పూర్తి చేశారో జనానికి తెలీదు. రిలీజ్ బజ్ కూడా లేదు. ఐతే నిఖిల్, సుధీర్ వర్మ మీద ఎక్కడో నమ్మకం. స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు మీద ఆధారపడిన సినిమా అని ట్రైలర్ చిన్న ఆశలు రేపింది. మరి ఆ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఎంత కొత్తగా వున్నాయి? ఎప్పుడో తీసిన సినిమా ఇప్పుటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉందా?
రిషి(నిఖిల్) ఓ లోకల్ రేసర్. హైదరాబాద్ లో అవకాశాలు లేకపోవంతో స్నేహితుడు యాజీ(హర్ష)తో కలసి లండన్ వస్తాడు. అక్కడ రిషికి తులసి (దివ్యాంశ కౌశిక్) పరిచయం అవుతుంది. కొద్దిరోజుల్లోనే తులసిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తాడు రిషి. ఓ గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. సరిగ్గా ముహూర్తం సమయానికి తులసి కనిపించకుండాపోతుంది. ఇది జరిగిన కొన్నాళ్ళకి తార(రుక్మిణి వసంత్) రిషి జీవితంలోకి వస్తుంది. ఇంతలో లండన్ లో వున్న గ్యాంగ్ స్టర్ బధ్రీనాథ్(జాన్ విజయ్) రిషిని కిడ్నాప్ చేస్తాడు. అసలు తులసి ఎక్కడికి వెళ్ళింది? తార ఎవరు? బధ్రీనాథ్ కి ఏం కావాలి? ఇదంతా మిగతా కథ.
ఏ కథనైనా క్రైమ్ ని మిక్స్ చేసే చెబుతుంటారు సుధీర్ వర్మ. ఈ సినిమా కోసం కూడా క్రైమ్ థీమ్ నే ఎంచుకున్నారు. ఆ క్రైమ్ కి ఒక లవ్ స్టోరీ ని మిక్స్ చేశారు. అయితే ఇందులో క్రైమ్ థ్రిల్ ఇవ్వలేదు, లవ్ స్టోరీ తేలిపోయింది. ప్రతి కథకి, క్యారెక్టర్ కి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంతో ఆడియన్ కనెక్ట్ అయినప్పుడే సినిమాని ఫాలో అవ్వగలరు. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ గాని, తన లక్ష్యంగాని ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసేలా ఉండవు. ఇక ఆ ప్రేమ కథ, క్రైమ్ థీమ్ లో కొత్తదనం ఉండడం సంగతి పక్కన పెడితే అసలు పసే లేకుండా పోయింది. ప్రేమ కథని క్రైమ్ లో బ్లెండ్ చేసిన విధానం ఎంత మాత్రం ఆసక్తికరంగా కుదరలేదు.
ఈ కథని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చెప్పే ప్రయత్నం చేశారు సుధీర్ వర్మ. రిషి కథని సత్య, సుదర్శన్ క్యారెక్టర్లు పరిచయం చేయడంతో కథనం మొదలవుతుంది. డెడ్ బాడీని మాయం చేయడానికి ప్రయత్నం చేసే ఓపెనింగ్ సీక్వెన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ తర్వాత వచ్చే కథనంపై కొంత ఆసక్తిని పెంచింది. అయితే ఆ సీక్వెన్స్ ని అక్కడే వదిలేసి లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. దాదాపు ఫస్ట్ అఫ్ అంత ఆ రొటీన్ లవ్ స్టోరీ విసిగించేసింది.
ఇక లండన్ లో తులసితో జరిగే ట్రాక్ కూడా బోరింగ్. ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మరో ఆప్షన్ లేకుండా ఇచ్చినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ని మరీ సిల్లీగా తీర్చిదిద్దారు. బద్రీనాథ్ క్యారెక్టర్ ని మొదట చాలా బిల్డప్ ఇచ్చి చివరికి సిల్లీ విలన్ గా తీసి పారేశారు. ఎక్కడ కూడా సీరియస్ నెస్ ఉండదు. అజయ్ మున్నా క్యారెక్టర్ ని మొదట్లో కాస్త బలంగానే చూపించారు. గాని చివర్లో ఆ క్యారెక్టర్ ని కూడా డమ్మీ చేశారు.
ఇందులో ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రతి ట్విస్ట్ మొదలవకుండానే ఆడియన్ కి అందిపోతుంటుంది. దీని అంతటికి కారణం.. వీక్ రైటింగ్. భలే వుందనిపించే ఒక్క సన్నివేశం కూడా ఇందులో కనిపించదు. అయితే సుధీర్ వర్మ మీద ఎక్కడో చిన్న నమ్మకం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అయినా సరే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో సినిమా గతిని మారుస్తారనే నమ్మకంతో కూర్చున్న ఆడియన్ కి నిరాశ మిగులుతుంది. ఆ క్లైమాక్స్ లో హీరో వేసిన ఎత్తుగడ చూస్తున్నప్పుడు ఏ కాలంలో రావాల్సిన సినిమా అనిపిస్తుంది. ఈపాటి ట్విస్ట్ కి ఓ సినిమా తీయాలా అనే ఫీలింగ్ కలుగుతుంది.
తన పాత్ర వరకు నిఖిల్ డీసెంట్ గానే చేశారు. అయితే ఆ క్యారెక్టర్ ని బలంగా రాసుకోలేదు. ఆ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉండదు. పైగా షూటింగ్లో చేసిన ప్యాచ్ వర్క్ కారణంగా నిఖిల్ లుక్ ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తుంది. పక్కపక్కన వచ్చే రెండు సీన్స్ లోనే తన లుక్ మారిపోయి ఉంటుంది. కొన్నిచోట్ల క్యాప్ పెట్టుకుని కూడా కవర్ చేశారు. రుక్మిణి వసంత్ అందంగా ఉంది. ఆమె ప్రేమ కథలో ఎమోషన్ లేదు. తాగిన మత్తులో పెళ్లి చేసుకునే ఆ ట్రాక్ అయితే ఏదో గొప్ప ఫీల్ ఇస్తుందని అనుకున్నారు కానీ మరీ అంత లాజిక్ లెస్ ట్రీట్మెంట్ ని ఆడియన్ తీసుకోవడం కష్టమే. ఇక దివ్యాంశ కౌశిక్ ది కిలాడి పాత్ర. ఆ పాత్ర ఆమెకు కొత్తే. అయితే ఆమె క్యారెక్టర్ లో కూడా ఆర్క్ ఉండదు. హర్ష సినిమా అంతా ఉంటాడు కానీ ఎక్కడ తన మార్క్ కనిపించదు. సత్య, సుదర్శన్ క్యారెక్టర్లు కథని చెప్పే వాయిస్ ఓవర్ లాంటి పాత్రలు తప్పితే ఈ కథలో ఆ పాత్రలకు సంబంధం లేదు. జాన్ విజయ్ సీరియస్ గా కనిపించే కామెడీ విలన్. అజయ్ ది కూడా రొటీన్ పాత్రే.
కార్తిక్ ఇచ్చిన పాటలు మెలోడియస్ గా ఉన్నాయి కానీ అవి రిజిస్టర్ అవ్వవు, సన్నీ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశంలో బలం లేకపోవడంతో తేలిపోయింది, గుర్తుపెట్టుకునే మాటలు లేవు. సినిమా దాదాపు లండన్ లో తీశారు. అయితే ఆ బ్యాక్ డ్రాప్ ఈ కథకు తీసుకొచ్చిన కొత్తదనం ఏమీ లేదు.
స్టొరీ, టేకింగ్ పరంగా ఇంటిలిజెంట్ గా ఆలోచిస్తారనే పేరు సుధీర్ వర్మకి వుంది. మరి ఇంత వీక్ స్టొరీ, రైటింగ్ తో సినిమాని ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. నిజానికి మూడేళ్లు ముందు రావాల్సిన సినిమా ఇది. కానీ అప్పుడు వచ్చినా ఈ సినిమా ఫలితంలో ఎలాంటి మార్పు వుండేది కాదేమో?
తెలుగు360 రేటింగ్: 1.5/5