ఈ వేసవి బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం సందడి లేకపోయింది. ఓ వైపు ఐపీఎల్ కలక్షన్లపై దెబ్బ కొట్టింది. మరోవైపు వీక్ కంటెంట్ తో.. ప్రేక్షకుల సహనాన్ని పరిశీలిస్తున్నారు మేకర్స్. అయితే.. ప్రతీవారం కొత్త సినిమాల రాక మాత్రం ఆగడం లేదు. ఈవారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అన్నీ చిన్నవే. కానీ ఈమధ్య చిన్న సినిమాలే థియేటర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న నేపథ్యంలో ఏ సినిమానీ తక్కువ చేసి చూసే అవకాశం, అవసరం లేకుండా పోయాయి. సారంగపాణి జాతకం, చౌర్య పాఠం, జింఖానా ఈ వారం విడుదల అవుతున్న సినిమాలు.
ఇంద్రగంటి మోహనకృష్ణకంటూ సెపరేట్ మార్క్వుంది. సున్నితమైన వినోదాత్మకమైన చిత్రాలు అందిస్తారన్న పేరుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని రూపొందించారు. ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రమిది. వెన్నెల కిషోర్ కీలక పాత్రధారి. టైటిల్, టీజర్, ట్రైలర్ బట్టి కథేమిటో గెస్ చేయొచ్చు. ప్రియదర్శి మంచి ఫామ్ లో ఉన్నాడు. తను నటించిన `కోర్ట్` మంచి విజయాన్ని సాధించింది. అందులో పూర్తి సీరియస్ పాత్ర పోషించాడు ప్రియదర్శి. ఇప్పుడు తనదైన కామెడీ టైమింగ్ పలికించడానికి రెడీగా ఉన్నాడు. మంచి టాక్ వస్తే, ప్రియదర్శి కోసం, ఇంద్ర గంటి మార్క్ కోసం జనాలు థియేటర్లకు వస్తారన్నది నిర్మాత ఆశ.
‘ధమాకా’తో ఆకట్టుకొన్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పుడు నిర్మాతగా మారారు. నక్కిన నేరేటీవ్స్ సంస్థ స్థాపించి, తొలి చిత్రంగా చౌర్యపాఠం రూపొందించారు. అంతా కొత్తవాళ్లే. కాకపోతే ప్రచారం కాస్త వినూత్నంగా చేస్తున్నారు. క్రైమ్ నేపథ్యంలో సాగే కథ ఇది. థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా మేళవించారని తెలుస్తోంది. ఈ జోనర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. కంటెంట్ బాగుంటే.. ఆదరించడానికి ప్రేక్షకులూ సిద్ధంగా ఉంటారు. వీటితో పాటుగా మలయాళ డబ్బింగ్ సినిమా ‘జింఖానా’ కూడా రెడీగా వుంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ ఈ సినిమాలో హీరో. ఈమధ్య మలయాళ చిత్రాలు తెలుగులో బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా యూత్ కంటెంట్ కు టికెట్లు తెగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘జింఖానా’ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.