2024లో అప్పుడే 4 నెలలు గడిచిపోయాయి. జనవరి సంక్రాంతి సినిమాల దయ వల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్రవరిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉపశమనం కలిగించింది. ఓం భీమ్ భుష్, ప్రేమలు, టిల్లూ స్క్వేర్ విజయాలతో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకొంది. టిల్లు వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఏప్రిల్ లో మళ్లీ నిరాశే. ఈ నెలంతా చప్పచప్పగా సాగింది. ఊహించని విజయాలేం లేవు. సర్ప్రైజ్లూ కనిపించలేదు.
సాధారణంగా వేసవి సీజన్లో భారీ చిత్రాలు వరుస కడతాయి. అయితే ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏపీలో ఎన్నికల వేడి వల్ల… సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలకు ధైర్యం సరిపోలేదు. పైగా అనుకొన్న సినిమాలేం సకాలంలో సిద్ధం కాలేదు. దానికి తోడు ఐపీఎల్ సీజన్ ఒకటి. ఇలా.. అనేక కారణాల వల్ల కొత్త సినిమాల ఊపు కనిపించలేదు.
ఈనెలలో దాదాపుగా 20 చిత్రాలు విడుదలయ్యాయి. సంఖ్యాపరంగా రాశి ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ వాసి మాత్రం శూన్యం. ‘ది ఫ్యామిలీస్టార్’ తప్ప చెప్పుకోదగిన పోస్టర్ కనిపించలేదు. విజయ్ – పరశురామ్ కాంబోలో రూపొందిన ఆ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్లకు దిల్ రాజు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గీతాంజలి మళ్లీ వచ్చింది, లవ్ గురు, మార్కెట్ మహా లక్ష్మి, పారిజాతపర్వం, రత్నం.. ఇలా ఒకదాని తరవాత మరోటి సినిమాలు ఫ్లాప్ అవుతూ వెళ్లాయి. ఏ సినిమాకీ కనీస వసూళ్లు కూడా దక్కలేదు. అసలు ఈనెలలో టాలీవుడ్ హిట్ అనే మాట కూడా వినలేకపోయింది.
మే ప్రధమార్థం వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మే తొలి వారంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘ప్రసన్నవదనం’ వస్తున్నాయి. వీటిపై కాస్తో కూస్తో ఫోకస్ ఉంది. అయితే ఎన్నికల సీజన్ లో రావడం ఈ చిత్రాల మైనస్. మే 17 నుంచి మళ్లీ మీడియం, పెద్ద రేంజ్ చిత్రాలు వరుస కడతాయి. మే నుంచి టాలీవుడ్ కాస్త స్పీడందుకొనే అవకాశం ఉంది.