వేసవి వినోదాల్లో మార్చి పూర్తి అయిపోయింది. 20 పైగా సినిమాలు వస్తే అందులో రెండు మాత్రమే నిలదొక్కుకోగలిగాయి. కోర్ట్, మ్యాడ్ 2 సినిమాలు మంచి ఫలితాన్ని చూశాయి. ఏప్రిల్ లో కూడా కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి.
ఏప్రిల్ మొదటి వారంలో శారీ, 28 డిగ్రీస్ సెల్సియస్, LYF – లవ్ యువర్ ఫాదర్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఇందులో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. లవ్ యువర్ ఫాదర్ చిత్రంలో ఎస్పీ చరణ్ నటించాడు. అదొక ఆకర్షణ.శారీ సినిమా రామ్ గోపాల్ వర్మ తీసింది. అయితే ఈ రెండు సినిమాలుకి థియేటర్స్ జనం వస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్.
ఏప్రిల్ 2 వారంలో జాక్, గుడ్ బాడ్ అగ్లీ, జాట్, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాలు వస్తున్నాయి. ఇందులో జాక్ కి మంచి క్రేజ్ ఉంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ఇది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. డిజే టిల్లు 2 తర్వాత సిద్దు నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా గుడ్ బాడ్ అగ్లీ. తమిళ్ స్టార్ అజిత్ హీరో. అయితే ఈ సినిమాకి చెప్పుకోదగ్గ ప్రమోషన్స్ లేవు. టీజర్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో సినిమాకి సరైన బజ్ కనిపించడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ కావడంతో సినిమా మంచి థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
వీర సింహా రెడ్డితో విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తొలి బాలీవుడ్ సినిమా జాట్. సన్నిడియోల్ హీరో. వీరసింహారెడ్డి తర్వాత తెలుగులో సినిమా చేయడానికి ప్లాన్ చేసిన గోపీచంద్. అది వర్కౌట్ కాకపోవడంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ ప్రయత్నం చేశాడు. సౌత్ డైరెక్టర్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మార్కులు కొడుతున్నారు. మరి ఈ సినిమాతో గోపికి ఎలాంటి ఫలితం వస్తుందో?
టీవీ యాంకర్ ప్రదీవ్ హీరో చేస్తున్న సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. జబర్దస్త్ షో డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్న నితిన్ భరత్ ఈ సినిమాకి దర్శకత్వం. ట్రైలర్ పాజిటివ్ గా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయడం మరో ఎట్రాక్షన్.
ఏప్రిల్ 17న ఓదెల 2 సినిమా వస్తుంది. తమన్నా హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నెలలో వస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సంపత్ నంది ఈ సినిమాకి షో రన్నర్. తమన్నాకి తెలుగులో మంచి విజయం దక్కి చాలా కాలమైంది. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ పడుతుందేమో చూడాలి.
ఏప్రిల్ 18న సారంగపాణి జాతకం వస్తోంది. ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా ఇది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్. కోర్ట్ సినిమాతో విజయం అందుకున్న ప్రియదర్శి ఈ సినిమాతో ఆ విజయాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ కు సైతం ఈ సినిమా కీలకం. సమ్మోహనం తర్వాత ఆయనకి మరో విజయం దక్కలేదు. మరి సారంగపాణి జాతకం ఆయన జాతకం ఎలా మారుస్తుందో చూడాలి.
ఏప్రిల్ చివరి వారంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన మల్టీస్టారర్ భైరవం సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోంది. అయితే ఇంకా అఫీషియల్ డేట్ రాలేదు. ఏప్రిల్ రెండో వారంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఏప్రిల్ లో కొత్త సినిమాలకి కొదవలేదు. వేసవి వినోదాన్ని పంచడానికి కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాయి. మరి ఇందులో ఎన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటాయో చూడాలి.