ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి చాలా భారీగా పెరిగాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర మరియు గరుడ సర్వీసులపై ఒకేసారి 10 శాతం చార్జీలు పెరిగాయి. దాని వలన ప్రతీ కిలోమీటరుకి 8-9 పైసలు చొప్పున పెరుగుతుంది. పల్లె వెలుగు బస్సు సర్వీసులపై కూడా 5శాతం పెరిగాయి. అయితే వెన్నెల సర్వీసులపై మరియు విద్యార్ధుల బస్ పాసుల చార్జీలు పెంచలేదు.
ఆర్టీసీఎం.డి.సాంభశివరావు విజయవాడలో ఆర్టీసీ హౌస్ లో విలేఖరులతో మాట్లాడుతూ “గత రెండేళ్లుగా ఆర్టీసీకి ఎన్ని నష్టాలు వస్తున్నా చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంటును పెంచడంతో ఆర్టీసీపై నెలకు రూ.55 కోట్లు అంటే ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం పడుతోంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీలు పెంచవలసి వచ్చింది. మేము 20శాతం పెంపు ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 శాతం పెంపుకు మాత్రమే అంగీకరించారు. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తులను వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా సంస్థ ఆదాయం పెంచుకోమని ముఖ్యమంత్రి సూచించారు,” అని తెలిపారు.
ఇంతకు ముందు విజయవాడ నుంచి హైదరాబాద్ కి రూ.213 ఉండగా ఇక నుంచి అది రూ.235 అవుతుంది. ఆర్టీసీ సంస్థ ఆరంభం అయినప్పుడు నుంచి నేటి వరకు ఎప్పుడూ నష్టాల్లోనే ఉందని చెపుతుంటారు. ఎందుకు నష్టాల్లో ఉందో చెపుతుంటారు. ఆ నష్టాలు ఎలాగా తగ్గించుకోదలిచారో కూడా చెపుతుంటారు. ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా చార్జీలు పెంచుతున్నపుడల్లా మళ్ళీ మళ్ళీ అదే పాట పడుతుంటారు. ఇప్పుడు అదే పాత పాట పాడారు ముందు కూడా పాడుతూనే ఉంటారు.