ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ను ప్రభుత్వం ఆకస్మాత్‌గా బదలీ చేసేసింది. ఆయనను లూప్ లైన్ పోస్టులోకి.. పంపేసింది. ఆర్టీసీ ఎండీగా ఆయనను నియమించి ఆరు నెలలు మాత్రమే అయింది. ఈ లోపే.. హడావుడిగా.. రాత్రికి రాత్రి బదిలీ చేసేశారు. గత ఏడాది డిసెంబర్ 30న ఏపీఐఐసీలో వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరక్టర్‌గా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్‌ను..అక్కడి నుంచి తప్పించి.. ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఆరు నెలల కాలంలోనే ఆయన పనితీరుతో ప్రభుత్వం విసిగిపోయింది. తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమయ్యాయి. అన్నీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెట్టాయి. దీంతో.. ఆయనను భరించలేమని నిర్ణయానికి వచ్చి.. రాత్రికి రాత్రి తప్పించి.. కృష్ణబాబుకు బాధ్యతలిచ్చారు. ఆరు నెలల కిందట.. మాదిరెడ్డి ప్రతాప్‌కు ఎండీ పదవి ఇచ్చేటప్పుడు కూడా ఇంచార్జ్ ఎండీగా కృష్ణబాబే ఉన్నారు. ఇప్పుడు ఆయనను తప్పించి కృష్ణబాబుకు అదనపు బాధ్యతలిచ్చారు.
మాదిరెడ్డి ప్రతాప్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయితే ఆయన ఎప్పుడూ.. లూప్లైన్లోనే ఉండేవారు. టీడీపీ హయాంలోనూ లూప్లైన్లో ఉన్నారు. ఆ సానుభూతితోనో… టీడీపీ హయాంలో ఉన్న అధికారులందర్నీ పక్కన పెట్టి.. ఇతరులకు చాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లోనో కానీ… వైసీపీ సర్కార్ ఆయనకు రాగానే.. ఎపీఐఐసీ ఎండీ పోస్ట్ ఇచ్చేసింది. అయితే.. అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలతో వణికిపోయిందేమో కానీ.. ఎక్కువ కాలం ఉంచకుండా.. ఆర్టీసీకి పంపారు. అక్కడా అదే పరిస్థితి. మాదిరెడ్డి ప్రతాప్.. ఉన్న ఆరు నెలల కాలంలో ఆర్టీసీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. దానికి కరోనా మాత్రమే కారణం కాదు.. మాదిరెడ్డి ప్రతాప్ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమేనన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రతాప్ బాధ్యతలు తీసుకున్న సమయంలోనే.. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆ సమయంలో.. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేట్ దారుణంగా పడిపోయింది. ఆ విషయంలో ఆర్టీసీ ఎండీ.. ప్రభుత్వ కార్యక్రమాలు లేకపోవడమే కారణమని సమర్థించుకున్నారు తప్ప.. పెంచే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత ప్రైవేటు బస్సులను బస్టాండ్లలో నిలుపుకునే చాన్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదీ వివాదం అయింది. ఆ తర్వాత కరోనా వచ్చి పడింది. ఆ సమంయలోనూ ఉద్యోగుల్ని విధులకు రావాలని.. ఒత్తిడి చేశారు. వచ్చాక ఏం చేయాలో చెప్పలేదు. తీరా బస్సులు ప్రారంభమైన తర్వాత.. ఆన్ లైన్ టిక్కెట్ల విషయంలో భారీ స్కాం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గోలంతా ఎందుకనుకున్నారేమో కానీ… ప్రభుత్వం.. నమస్కారం పెట్టేసింది.