తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిలుకలూరిపేటలో పదిహేడో తేదీన నిర్వహించబోయే బహిరంగసభ కు బస్సులు ఇస్తామని… ఆర్టీసీ అధికారులు టీడీపీకి సమాచారం ఇచ్చారు. బస్సులు కావాలని.. ఇవ్వకపోతే .. తాము తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆలోచిస్తామని ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. దీనికి స్పందించిన అధికారులు.. బస్సులు ఇస్తామని ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ పెట్టాలని లేఖ రాశారు.
ఆర్టీసీ అధికారుల్లో ఈ మార్పు బెదిరింపుల వల్ల రాలేదు. పదిహేడో తేదీన సభ జరుగుతుంది. ఆ రోజుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. పైగా ఆ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. బస్సులు , ట్రాన్స్ పోర్టుకు ఆటంకాలు కలిగిస్తే.. వచ్చే ఇబ్బందుల గురించి వైసీపీ నేతలకు తెలుసు. అందుకే అధికారులకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని సూచనలు జారీ చేశారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీని వైసీపీ సొంత ఆస్తిలా వాడుకుంది. డబ్బులు కూడా కట్టకుండా.. ఇష్టారీతిన పార్టీ సమావేశాలకు ఉపయోగించుకున్నారు. బటన్ నొక్కుడు సభలకు జన సమీకరణ కోసం ఆర్టీసీనే వాడుకున్నారు. కానీ అవి రాజకీయ. సభలని వాటిని చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది.
అధికారులు చాలా వరకూ రూటు మార్చుకుంటున్నారు. మెల్లగా తాము చట్టబద్ధంగా పని చేస్తామని చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వారు ఎలా వ్యవహరిస్తారో కానీ ఇప్పుడు మాత్రం మార్పు కనిపించడం ప్రారంభమయింది. వైసీపీ గెలిచే చాన్స్ లేదన్న నమ్మకం బలపడటంతో ఇప్పటి వరకూ ఊడిగం చేసిన వారు కూడా.. భవిష్యత్ భయంతో మెల్లగా పరిచయస్తుల్ని పట్టుకుని మూడు ప్రధాన పార్టీల్లోని ముఖ్యులతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.