తెలుగు రాష్ట్రాల్లో ఇది పండుగల సీజన్. కానీ… వాతావరణం భిన్నంగా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోజుకొకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి… కుటుంబాలను పోషించలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి కన్నా… ఈ ఆత్మహత్యల ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల మరణమృదందం..!
ఆర్టీసీ కార్మికులు మనో వ్యధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ.. సమస్యకు పరిష్కారం మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. కార్మికులు చర్చలకు సిద్ధంగానే ఉన్నారు. చర్చలు జరపాలని.. హైకోర్టు ఆదేశించక ముందు నుంచే… కార్మికులు… ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తే … చర్చించడానికి సిద్ధమని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకే విధానంతో ఉంది. ఆర్టీసీ మూతే… సమ్మెకు పరిష్కారమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మోహమాటంగా చెబుతున్నారు. అందుకే.. ప్రభుత్వం వైపు నుంచి సమ్మె విరమణకు ఎలాంటి చొరవా తీసుకోవడం లేదు. ఫలితం మనోస్థైర్యం కోల్పోతున్న ఉద్యోగులు.. ప్రాణం తీసుకోవడమే తీవ్ర నిర్ణయానికి వెనుకాడటం లేదు.
ఏపీలో భవన నిర్మాణ కార్మికులదీ అదే పరిస్థితి..!
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు వచ్చిన కష్టం ఇది. రోజు కూలీకి వెళ్తే తప్ప… రోజు గడవని కుటుంబాల దీన స్థితి ఇది. తమ దుస్థితి చెప్పుకునేటప్పుడు… నిరుపేదలు కళ్లలోనుంచి వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్లినా.. ఇలాంటి పేదలే కనిపిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టుకోలేక… కుటుంబాన్ని పోషించుకోలేక… అప్పుల పాలై… దిగులుతో ప్రాణాలు తీసుకునేవారు అంతకంతకూ పెరిగిపోతున్నారు. కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తూండగా.. మరికొన్ని బయటకు రావడం లేదు. ఇప్పటికి ఐదుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వాలే..!?
ప్రభుత్వాల నిర్ణయాల వల్లే.. ఆత్మహత్యల పరిస్థితి వచ్చిందని పెద్దలకూ తెలుసు. ఇలాంటప్పుడు.. వారికి మానసిక స్థైర్యం కల్పించడం మానవత్వం ఉన్న నేతల లక్షణం. కానీ దురదృష్టవశాత్తూ.. అలాంటి ప్రయత్నాలేమీ జరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు కొనసాగితే.. ప్రజల్లో ఓ రకమైన ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. పాలనంటే… మరో దృక్పథంతో చూస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఈ విషయంపై ఇంకా అవగాహనకు రాలేకపోతున్నారు. సొంత ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా…. కళ్లు మూసుకుంటున్నారు.