తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ విషయంలో ఏం జరిగిందో మొత్తం ప్రజల ముందుకు వచ్చింది. అసలు ఏఆర్ డెయిరీకి నెయ్యి ఉత్పత్తి సామర్థ్యమే గతంలోనే టెండర్లు ఖరారు చేసే సమయంలోనే టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్దారించిన డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఉత్పత్తి కాదు కదా నిల్వ చేసే ఫెసిలిటీస్ కూడా ఏఆర్ డెయిరీకి లేవు. పేరుకు ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యతో బయలుదేరే లారీలు మధ్యలో ఎక్కడికో పోయి నెయ్యి నింపుకుని వారం పది రోజుల తర్వాత తిరుమలకు వస్తున్నాయి. ఆ నెయ్యి ఎక్కడ నింపుకుంటున్నారన్నదే కీలకం.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏఆర్ డెయిరీకి నోటీసులు జారీ చేసింది. సోదాలు చేసి కనీస ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేల్చి లైసెన్స్ రద్దు చేయాలని నోటీసులు జారీ చేసింది. లా నోటీసులపై మధురై హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించారు. ఆ సంస్థ ఎండీ బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి వెనుక ఎవరు ఉన్నారో మొత్తం బయటకు రానుంది. నెయ్యి మాత్రమే కల్తీ అయింది. లడ్డూ కాలేదనే విచిత్ర వాదనలు కోర్టులో వైసీపీ వినిపిస్తున్న సమయంలో ఇవన్నీ వెలుగులోకి రావడం సంచలనమే.
కల్తీ నెయ్యి కాంట్రాక్టు కోసం అడ్డగోలు టెండర్లు మార్చారని కూడా తేలిపోయింది. కోర్టులో ఇవన్నీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే దాదాపుగా కీలకమైన విషయాలన్నీ రాబట్టారు.. అందుకే తదుపరి విచారణ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.