మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ ల ప్రయాణం ముఫ్ఫై ఏళ్ళు పూర్తి చేసుకుంది. రోజా నుంచి పొన్నియన్ సెల్వన్ వరకూ ఎన్నో మరపురానికి పాటలని అందించిన జోడి ఇది. ప్రస్తుతం పీఎస్ 2 ప్రచార కార్యక్రమాలలో భాగంగా తమ ప్రయాణానికి సంబధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. సినిమా మ్యూజిక్ విషయంలో రెహమన్ తన ఆలోచన ధోరణి మార్చారని చెప్పుకొచ్చారు మణిరత్నం.
‘ఇళయరాజా గారితో పని చేసిన్నపుడు కథ మొత్తం చెప్పి ఒక సందర్భానికి పాట కావాలని అడిగేవాడిని. ఆయన కూడా నేను ఎలా షూట్ చేస్తానేనో అని తెలుసుకొని దానికి తగట్టు ట్యూన్స్ ఇచ్చేవారు. కానీ రెహ్మాన్ తో పని చేసిన మొదటి సినిమాకి నాకు కొత్త అనుభవం ఎదురైయింది. రోజా కథ మొత్తం చెప్పిన తర్వాత నాకు కొన్ని ట్యూన్స్ వినిపించాడు. చాలా అద్భుతంగా వున్నాయి. ఆ ట్యూన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎలా షూట్ చేయాలనేది నాకే ఒక సవాల్ గా అనిపించింది. దీని గురించి రెహ్మాన్ ని అడిగితే.. ”మీరు ఒక సినిమా కథ చెప్పారు.. దానికి ట్యూన్స్ ఇచ్చాను. వాటిని ఎలా వాడుకుంటారో మీ ఇష్టం” అన్నాడు. అది నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి మొత్తంగా సినిమాకి మ్యూజిక్ చేయడం అలవాటైయింది” అని చెప్పుకొచ్చారు మణిరత్నం.